
హైదరాబాద్ అశోక్‌నగర్‌లోని ఓ హాస్టల్‌లో ఇటీవల ప్రవళిక అనే యువతి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ప్రవళిక మృతిపై విపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలపై ఆమె తల్లి, సోదరుడు క్లారిటీ ఇచ్చారు. శివరామ్ అనే యువకుడి వేధింపుల వల్లే ఆమె మృతిచెందిందని.. అనవసరమైన ఆరోపణలు చేయొద్దంటూ కోరారు. ఈ తరుణంలో ప్రవళిక మృతిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మరోసారి స్పందించారు. ప్రవళిక కుటుంబానికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. యువకుడి వేధింపుల వల్లే ప్రవళిక చనిపోయిందని కేటీఆర్ చెప్పారు. ఇటీవల హైదరాబాద్లో ఆత్మహత్యకు ప్రవళిక కుటుంబ సభ్యులు బుధవారం మంత్రి కేటీఆర్‌ను కలిశారు.
ప్రవళిక మరణానికి శివరామ్ అనే వ్యక్తి కారణం అని, అతన్ని కఠినంగా శిక్షించాలని ఆమె కుటుంబసభ్యులు మంత్రిని కోరారు. ప్రవళిక మరణం చాలా దురదృష్టకరమని మంత్రి కేటీఆర్ వారికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సంఘటనకు సంభందించిన అన్ని వివరాలు డీజీపీ ద్వారా తెలుసుకున్నానని.. ప్రవళిక మృతికి కారణమైన వ్యక్తికి తప్పకుండా తగిన శిక్ష పడేలా చూస్తామని మంత్రి వారికి తెలిపారు. ప్రవళిక కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని, ఆమె సోదరుడికి ఉద్యోగం ఇప్పిస్తానని ప్రవళిక కుటుంబ సభ్యులకు మంత్రి హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రవళిక మృతిని రాజకీయం చేశారంటూ మండిపడ్డారు. ప్రవళిక కుటుంబసభ్యలు కలిసి వారికి జరిగిన అన్యాయం గురించి చెప్పి ఆవేదన చెందారని.. వారికి ఆర్థికంగా న్యాయం చేయడంతోపాటు పార్టీ అండగా ఉంటుందని హామీనిచ్చినట్లు కేటీఆర్ తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..