KTR: కల్వకుంట్ల తారకరామారావు.. తెలంగాణ ఐటీ మినిస్టర్. బయట అందరూ ఆయన్ను కేటీఆర్ అంటారు. అయినవాళ్లు రామన్న అంటారు. ఫారెన్‌లో చదువుకున్నప్పటికీ తెలుగు భాషపై పూర్తి స్థాయి పట్టున్న వ్యక్తి. పల్లెటూరి యాసలోనూ ప్రతిపక్షాలపై పదునైన పంచ్‌లు పేలుస్తారు. పెట్టుబడులు కోసం విదేశాలు వెళ్లినప్పుడు వారెవ్వా అనిపించేలా ఇంగ్లీష్ స్పీచ్‌లు ఇస్తారు. తన శాఖల నిర్వహణలోనూ కేటీఆర్ శైలి విభిన్నం. కాసేపు రాజకీయాలు పక్కనబెడితే.. కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఎవరైనా సాయం కోరితే వెంటనే స్పందిస్తారు. ఆపదలో ఉన్నవారికి చేయూత అందించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తారు. అలానే ఆయన ఓ నిరుపేద యువతి చదువుకోడానికి అండగా నిలబడ్డారు. కేటీఆర్ అండతో ఆ చదవుల తల్లి విజయం సాధించింది. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన రుద్ర రచన.. అనాధాశ్రమంలో ఉండి.. ప్రభుత్వ పాఠశాల్లలో చదువుకుంది. ఈ సెట్ ద్వారా నగరంలోని ప్రముఖ కాలేజీలో ఇంజనీరింగ్ సీటు సంపాదించింది. అయితే అక్కడ ఫీజు కట్టేందుకు ఆమెకు చేతిలో చిల్లిగవ్వ లేదు.
ఆ యువతి పరిస్థితి గురించి మంత్రి కేటీఆర్‌కు తెలియగానే వెంటనే స్పందించారు. ఆమె ఫీజులకు అయ్యే ఖర్చులను తనే స్వయంగా భరించారు. కేటీఆర్ సహకారంతో ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసిన రుద్ర రచన.. 4 ప్రముఖ ఐటీ కంపెనీల నుంచి ఉద్యోగ ఆఫర్లు పొందింది. తాజాగా ఆమె మంత్రి కేటీఆర్‌ను ప్రగతి భవన్‌లో కలిసింది. ఓ అన్నలా తన చదువు కోసం నిలబడిన కేటీఆర్‌కు.. ఆమె ధన్యవాదాలు తెలిపింది. తన సేవింగ్స్‌తో ప్రత్యేకంగా తయారు చేయించిన వెండి రాఖీని కేటీఆర్ చేతికి కట్టింది. రచన అభిమానానికి మంత్రి కేటీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. అనేక సవాళ్ళను ఎదుర్కొని విజయం సాధించిన రచన.. నేటి యువతరానికి ఆదర్శం అని మంత్రి పేర్కొన్నారు. ఆమె సివిల్ సర్వీసెస్ కలకు అండగా ఉంటానని తెలిపారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి