బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై మంత్రి కొండా సురేఖ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లిక్కర్ కేసులో ఇరుక్కొని బీజేపీ నేతల కాళ్లు మొక్కి బయటపడ్డ కవిత.. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం.. దెయ్యాలు వల్లించినట్లు ఉందన్నారు. ఇటీవల గ్రేటర్ వరంగల్ అభివృద్ది కార్యక్రమాలపై మంత్రి కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కొండా సురేఖ బీఆర్ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భద్రాద్రి సీతారాములకు కేసీఆర్ మనవడు ఏ హోదాలో పట్టు వస్త్రాలు తీసుకెళ్లాడని ప్రశ్నించారు. ఆ సొమ్ము కేసీఆర్ సొంత డబ్బులేనా..? ప్రజల సొమ్ము దోచుకున్న బీఆర్ఎస్‌కు.. కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత లేదని ధ్వజమెత్తారు మంత్రి కొండా సురేఖ.
లిక్కర్ రాణిగా పేరు పొందిన కవిత.. బీజేపీ నేతల కాళ్లు మొక్కి తప్పించుకున్నారని.. కవిత ఎక్కడ నుంచి ఎంపీగా పోటీ చేసినా ప్రజలు ఓడగొట్టి ఇంటికి పంపుతారని హెచ్చరించారు. కవిత మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని.. తాము తెలంగాణ ప్రజలకు జవాబుదారీగా ఉంటామని అన్నారు కొండా సురేఖ. పూలే గురించి ఎమ్మెల్సీ కవిత మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్న కొండా సురేఖ.. పదేళ్లు పరిపాలించినప్పుడు పూలే గుర్తుకు రాలేదా అంటూ ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ నేతలకు భూముల కబ్జాపై ఉన్న దృష్టి.. అభివృద్ధిపై లేదని.. కేసీఆర్, కేటీఆర్ వైఫల్యంతోనే కేంద్ర ప్రభుత్వ నిధులను తేలేకపోయారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు.