
మెదక్ జిల్లా, అక్టోబర్ 22: ఉమ్మడి మెదక్ జిల్లాలోని మూడు నియోజకవర్గాలపై సీరియస్‌గా దృష్టి సారించారు మంత్రి హరీష్ రావు. అక్కడ ఉన్న నేతలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ నియోజకవర్గాల్లో ఏం జరుగుతుంది అని ఆరా తీస్తున్నారు మంత్రి హరీష్ రావు. ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట.. జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాలు ఉంటే 2018లో 9 స్థానాలను బీఆర్‌ఎస్ గెలుచుకుంది.
ఈ సారి పదికి పది స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారు మంత్రి హరీష్‌రావు. బీఆర్‌ఎస్‌కి కొంత ఇబ్బందిగా ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు మంత్రి హరీష్‌రావు. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలోని సంగారెడ్డి, జహీరాబాద్, మెదక్ స్థానాల్లో గెలుపు కోసం ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నారు మంత్రి హరీష్ రావు.
జహీరాబాద్ ఎమ్మెల్యే మానిక్ రావు పని తీరుపై నియోజకవర్గవ్యాప్తంగా కొంత వ్యతిరేకత ఉంది. ఈసారి ఎన్నికల్లో ఇక్కడ సిట్టింగ్‌ను మార్చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. దీంతో చాలా మంది ఎమ్మెల్యే టికెట్ ఆశించి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కానీ మానిక్‌రావుకే మళ్లీ టికెట్ ప్రకటించింది అధిష్టానం. దీంతో కొంతమంది పార్టీని వీడారు. మరికొంతమంది పార్టీలోనే ఉంటూ మానిక్‌రావుకి మద్దతు ఇవ్వడం లేదు. ఇవన్నీ గమనించిన హరీష్‌రావు.. ఈ నియోజకవర్గంపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు.
ఇక మెదక్ నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికే మళ్ళీ టికెట్ వచ్చింది. అయితే ఇక్కడ కాంగ్రెస్ నుంచి మైనంపల్లి హన్మంత్ రావు కొడుకు రోహిత్ పోటీలో ఉన్నారు. మొన్నటి వరకు బీఆర్ఎస్‌లో ఉన్న మైనంపల్లి.. మెదక్ బీఆర్ఎస్ టికెట్‌ను తన కొడుక్కు ఇవ్వాల్సిందిగా కోరారు. అయితే టికెట్ రాదని తేలడంతో.. కాంగ్రెస్ నుంచి బరిలోకి దింపుతున్నారు. ఇక్కడ ఎలాగైనా గెలిచి తీరుతామని ఛాలెంజ్ చేశారు మైనంపల్లి. దీంతో ఇక్కడ మైనంపల్లిని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు హరీష్‌రావు.
గత ఎన్నికల్లో మెదక్ జిల్లా నుంచి కాంగ్రెస్ గెలిచిన ఏకైక సీటు సంగారెడ్డి. అక్కడ ఈసారి కూడా జగ్గారెడ్డి, చింతా ప్రభాకర్ మధ్యే పోటీ జరుగుతోంది. ఈ నియోజకవర్గంలో ఈ సారి గులాబీ జెండా ఎగురవేసేలా వ్యూహాలు రచిస్తోంది అధికార బీఆర్‌ఎస్. దీంతో ఈ నియోజకవర్గంపైనా ప్రత్యేక ఫోకస్ పెట్టారు మంత్రి హరీష్‌రావు.
ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లోని ప్రతిపక్ష పార్టీల నాయకులను బీఆర్ఎస్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా ఉమ్మడి జిల్లాలో ఉన్న పది పదికి స్థానాలు బీఆర్ఎస్ గెలవాలని పార్టీ నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారట మంత్రి హరీష్ రావు..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి