Telangana Jobs: కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోడీ సర్కార్ హామీ ఏమైందంటూ ఆయన ప్రశ్నించారు. పేదలకు ఉచితాలు ఇవ్వొద్దని చెప్తున్న బీజేపీ ప్రభుత్వం.. మాత్రం వ్యాపారులకు మాత్రం వేల కోట్లు మాఫీ చేస్తుందంటూ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. కేంద్ర సర్కార్ అన్నింటి ధరలు పెంచి పేదలపై భారం మోపిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్యాస్ సిలిండర్ ధర రూ.వెయ్యి దాటడంతో సామాన్యులు కొనలేని పరిస్థితి నెలకొందన్నారు. గురువారం సంగారెడ్డి పట్టణంలో, సదాశివపేటలో కొత్త పింఛనుదారులకు మంత్రి హరీశ్ రావు స్మార్టు కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ.2016 పెన్షన్ ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 40 లక్షల మందికిపైగా లబ్ధిదారులకు ఆసరా పింఛన్లు అదిస్తున్నామని.. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తుందన్నారు.
కాగా.. తెలంగాణలో ఖాళీగా ఉన్న 9 వేల గ్రూప్ 4 ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తామని, మరో రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందని మంత్రి హరీశ్ హామీనిచ్చారు. రాష్ట్రంలో మరో 28 వేల ఉద్యోగాలు, డీఎస్సీ నోటిఫికేషన్ ను వచ్చేవారంలో ఇస్తామని నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 లక్షల 10 వేల ఉద్యోగాలు ఇచ్చామని మంత్రి హరీష్‌రావు తెలిపారు. పేద ప్రజల కోసం సీఎం కేసీఆర్ పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి అమలు చేస్తున్నారన్నారు. సొంత స్థలాల్లో ఇళ్లు కట్టుకోవడానికి ప్రభుత్వం రూ.3 లక్షలు ఇచ్చే కార్యక్రమాన్ని దసరా పండుగకు ప్రారంభిస్తామని హరీశ్ రావు తెలిపారు.