Harish Rao: బీజేపీవి అబద్ధపు హామీలు అసత్య ప్రచారాలు.. టీఆర్ఎస్ గెలుపుతో ములుగోడు అభివృద్ధిని మలుపు తిప్పుతుందన్న మంత్రి హరీష్ రావు

కృష్ణా జలాల్లో వాటాను నిర్ణయించడానికి ఇంకెన్నేళ్లు పడుతుందని ప్రశ్నించారు. మునుగోడులో ఓటు అడిగే నైతిక హక్కు బీజేపీకి లేదని హరీష్ రావు అన్నారు.

Harish Rao: బీజేపీవి అబద్ధపు హామీలు అసత్య ప్రచారాలు.. టీఆర్ఎస్ గెలుపుతో ములుగోడు అభివృద్ధిని మలుపు తిప్పుతుందన్న మంత్రి హరీష్ రావు
Minister Harish Rao

Updated on: Oct 16, 2022 | 12:36 PM

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే హేళన చేసిన బీజేపీకి మునుగోడుపై ప్రేమ ఎందుకు ఉంటుందని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంపై ఏడాది దాటినా దాని ఊసే లేదని విమర్శించారు. కృష్ణా జలాల్లో వాటాను నిర్ణయించడానికి ఇంకెన్నేళ్లు పడుతుందని ప్రశ్నించారు. మునుగోడులో ఓటు అడిగే నైతిక హక్కు బీజేపీకి లేదని హరీష్ రావు అన్నారు. నల్లగొండ జిల్లాపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు ప్రత్యేక ప్రేమ ఉందన్నారు. మునుగోడు నుంచి ఫ్లోరైడ్‌ రక్కసిని సీఎం కేసీఆర్‌ తరిమికొట్టారని గుర్తుచేశారు. ఉచిత విద్యుత్‌ ద్వారా అత్యధికంగా లబ్దిపొందుతున్న జిల్లా నల్గొండ అని హరీష్ రావు వివరించారు. ఎనిమిదేళ్ల బీజేపీ పాలనలో విద్వేషాన్ని పెంచడం తప్ప చేసిందేమి లేదని హరీశ్‌ రావు విమర్శించారు. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి విజయం అక్కడ అభివృద్ధిని మలుపు తిప్పుతుందని అన్నారు. ఈ ఉపఎన్నిక ఎందుకు వచ్చిందో మునుగోడు ప్రజలు ఆలోచించాలని హరీశ్‌ రావు పిలుపునిచ్చారు.

పెన్షన్ విషయంలో బీజేపీ నేతలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు హరీష్ రావు. ఆసరా పెన్షన్ మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం విడ్డూరమన్నారు. మోడీ ప్రభుత్వం రూ. 3 వేల పెన్షన్ ఇస్తే.. ముందు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇవ్వాలని డిమాండ్ చేశారు.

గుజరాత్ లో కేవలం 6 వందల రూపాయల పెన్షనే ఎందుకు ఇస్తున్నారని హరీష్ రావు ప్రశ్నించారు. హుజురాబాద్, దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో బీజేపీ నేతలు ఎన్నో చెప్పారని.. కేంద్రం నుంచి నిధులు తెస్తామని హామీ ఇచ్చారని హరీష్ గుర్తు చేశారు. ఇంతవరకు హుజురాబాద్, దుబ్బాకకు కేంద్ర సర్కార్ రూపాయి కూడా ఇవ్వలేదని వెల్లడించారు.


మరిన్ని తెలంగాణ వార్తల కోసం