
మైక్రో ఫైనాన్స్ నిర్వహకులు ఆగడాలు శృతిమించుతున్నాయి. వీళ్ల వేధింపులకు అడ్డూఅదుపు లేకుండా పోతుంది. అధిక వడ్డీలకు డబ్బులు ఇవ్వడం.. అవి కట్టాలని తీసుకున్న వారిపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేయడం..అప్పు తీసుకున్న వారి ఇంటి వద్దకు వెళ్లి నానా హంగామా చేయడంతో.. అవమాన భారం భరించలేక కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు..ఇలాంటి ఘటనే తాజాగా మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది.. తూప్రాన్ పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వరలక్ష్మి అనే మహిళ నవంబర్ 23, ఆదివారం స్థానిక పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె మైక్రో ఫైనాన్స్ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు మృతురాలు బంధువులు తెలిపారు..మేడ్చల్ లోని ఫైవ్ స్టార్ అనే మైక్రో ఫైనాన్స్ నుండి నాలుగు లక్షలు,తూప్రాన్ పట్టణంలోని క్రిష్ బ్యాంక్ మైక్రో ఫైనాన్స్ నుంచి 80 వేల రూపాయలు అప్పు తీసుకుందని. అయితే ఆదివారం ఉదయం క్రిష్ ఫైనాన్స్‌కి చెందిన ఏజెంట్లు వరలక్ష్మి ఇంటి వద్దకు వచ్చి బకాయి ఉన్న 20,000 రూపాయలు వెంటనే చెల్లించాలని ఒత్తిడి చేస్తూ,ఇష్టం వచ్చినట్లు మాట్లాడడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. దీంతో చెరువులో దూకి తనువు చాలించింది.
గత కొద్దిరోజులుగా ప్రతిసారి ఇంటి వద్దకు ఫైనాన్స్ ఏజెంట్లు రావడం.. డబ్బుల కోసం తీవ్రంగా ఒత్తిడి చేసేవారని.. అందుకే బలవ్మరణానికి పాల్పడిందని బంధువులు కన్నీటి పర్యంతం అయ్యారు. వరలక్ష్మీ బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..