Medaram Jathara: మేడారానికి పూనకం.. వనం వీడి జనం మధ్యకు సమ్మక్క

|

Feb 22, 2024 | 7:37 PM

మేడారం పులకించింది. గిరిజన జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. సమ్మక్క ఆగమనంతో జాతరకు పూనకం పుట్టింది. కోయదొరల డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలు, పోలీసు అధికారి తుపాకీ కాల్పుల మధ్య... తల్లి సమ్మక్కను గద్దెలపైకి చేర్చారు. ఈ పతాక ఘట్టాన్ని చూసేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ఆ అద్భుతాన్ని కనులారా వీక్షించిన భక్తకోటి పరవశించింది.

Medaram Jathara: మేడారానికి పూనకం.. వనం వీడి జనం మధ్యకు సమ్మక్క
Sammakka
Follow us on

మేడారం మహా జాతర అత్యంత కోలాహలంగా సాగుతోంది. సమ్మక్క-సారలమ్మల నామస్మరణతో కీంకారణ్యం పులకించిపోతోంది. అశేష జనవాహినికి అభయమిచ్చేందుకు ఆదివాసీల ఇలవేల్పు సమ్మక్క చిలకలగుట్ట నుంచి గద్దెలపైకి చేరుకుంది. సమ్మక్క తల్లి నామస్మరణతో ఆ ప్రాంతమంతా మార్మోగింది.

మేడారం మహా జాతరలో అత్యంత కీలకఘట్టం సమ్మక్క ఆగమనమే. సమ్మక్క ఆగమనం కోసం ఉదయమే ఏర్పాట్లు మొదలయ్యాయి. పూజారులు అడవి నుంచి వెదురు వనం, అడెరాలు తెచ్చి గద్దెపై ఉంచారు. సాయంత్రం ప్రధాన పూజారి నేతృత్వంలో పూజాలరుల బృందం చిలుకలగుట్ట అడవికి వెళ్లింది. అక్కడి నుంచి గుట్టుపైకి ప్రధాన పూజారి ఒక్కరే వెళ్లారు. అక్కడ పూజా తంతు అంతా ఆనవాయితీ ప్రకారం గోప్యంగా సాగింది. ఆ తర్వాత తల్లిని తీసుకొని కిందికి దిగారు. సమ్మక్క గద్దెలపైకి రాగానే జిల్లా ఎస్పీ గౌరవసూచకంగా గాల్లో కాల్పులు జరపడం ఆనవాయితీగా వస్తోంది. సమ్మక్క రాకను సూచించే ఈ శబ్దంతో ఒక్కసారిగా చిలకలగుట్ట ప్రాంతం భక్తిభావంతో ఉప్పొంగిపోయింది. ప్రభుత్వం తరపున మంత్రి సీతక్క స్వాగతం పలికారు. ఆమె రాక కోసం తనువెల్లా కళ్లు చేసుకొని ఎదురు చూసిన యావత్ భక్తకోటి… ఆమె గుట్ట దిగగానే జేజేలు పలికారు. సమ్మక్కను చిలకల గుట్ట నుంచి దాదాపు 2 కిలోమీటర్ల పొడవునా డోలు వాద్యాలు, గిరిజన సంప్రదాయ నృత్యాలతో ఊరేగింపుగా తీసుకొచ్చారు. డప్పు చప్పుళ్లు, డోలు వాద్యాలు మారుమోగుతుంటే అడవిని వీడి సమ్మక్క జనం మధ్యకు వచ్చి గద్దెలపైకి చేరింది.

తొలిరోజు వనదేవతల గద్దెలపైకి రావడం ఆద్యంతం సందడిగా సాగింది. కన్నెపల్లి నుంచి సారలమ్మ అమ్మవారిని ఆదివాసీ పూజారులు డోలు వాయిద్యాలతో తోడ్కొని వచ్చి గద్దెలపై ప్రతిష్ఠించారు. పగిడిద్దరాజు, గోవిందరాజులనూ గద్దెలపై కొలువుదీర్చారు. ఇక గద్దెలపైన కొలువైన వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. జంపన్నవాగు జనసంద్రమైంది. కీకారణ్యం కోలాహలంగా మారింది. ఇది జనమా – వనమా అనట్లు మేడారం అభయారణ్యం మొత్తం జనారణ్యంగా మారిపోయింది. ఎడ్ల బండ్ల నుంచి మొదలుకొని హెలికాప్టర్ల వరకు మేడారానికి కదిలారు. అశేష జనవాహినితో కీకారణ్యం కొత్త శోభను సంతరించుకుంది. భక్తులు జంపన్న వాగులో పుణ్యస్నానాలాచరిస్తూ ఎత్తుబంగారాలు, ఒడిబియ్యం సమర్పిస్తున్నారు. సల్లంగా సూడు తల్లీ అంటూ శరణు ఘోషలతో దిక్కులు పిక్కటిల్లుతున్నాయి. ఇక జాతరలో మూడోరోజు గద్దెలపైన తల్లులంతా కనిపించడంతో భక్తులు ఆనందానికి అవధులు ఉండవు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…