
మెదక్ జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఒకే రోజు.. కేవలం కొన్ని గంటల వ్యవధిలో రెండు వేర్వేరు ప్రాంతాల్లోని ఎస్బీఐ ఏటీఎంలను టార్గెట్ చేసి భారీ దోపిడీకి పాల్పడ్డారు. మంభోజిపల్లిలోని ఏటీఎంను గ్యాస్ కట్టర్‌తో ధ్వంసం చేసిన దుండగులు.. ఏకంగా రూ.14 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. ఒకే రోజు రెండు చోట్ల ఏటీఎం చోరీలు జరగడంతో జిల్లా ప్రజలు, బ్యాంకు అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
పరిస్థితి చూస్తే దొంగలు పక్కా ప్లాన్‌తో రెచ్చిపోయారు. రాత్రి వేళల్లో సంచరిస్తూ ఎస్బీఐ ఏటీఎంలను టార్గెట్ చేశారు. చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లిలోని ఎస్బీఐ ఏటీఎంతో పాటు మెదక్ మండలం మంభోజిపల్లిలోని ఎస్బీఐ ఏటీఎంలోనూ చోరీకి పాల్పడ్డారు. ఒకే రోజు రెండు వేర్వేరు మండలాల్లో జరిగిన ఈ వరుస చోరీలు పోలీసులకు సవాల్‌గా మారాయి.
మంభోజిపల్లి ఎస్బీఐ ఏటీఎం వద్ద దుండగులు పక్కా స్కెచ్‌తో వ్యవహరించారు. కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు.. తమను ఎవరూ గుర్తుపట్టకుండా ముఖాలకు గుడ్డలు కట్టుకుని ఏటీఎం కేంద్రంలోకి ప్రవేశించారు. అనంతరం గ్యాస్ కట్టర్‌తో ఏటీఎం మిషన్‌ను ధ్వంసం చేసి.. అందులో ఉన్న రూ.14 లక్షల నగదును దోచుకుని పరారయ్యారు. ఈ చోరీకి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి.
ఒకే రోజు జిల్లాలో రెండు ప్రాంతాల్లో ఏటీఎం చోరీలు జరగడంతో మెదక్ జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, డీఎస్పీ ప్రసన్నకుమార్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలాలను పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు.. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
క్లూస్ టీమ్ సాయంతో ఘటనా స్థలాల్లో వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ వరుస ఏటీఎం చోరీల వెనుక అంతర్రాష్ట్ర దొంగల ముఠా హస్తం ఉందా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీటీవీ ఫుటేజీ, సాంకేతిక ఆధారాల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ప్రత్యేక బృందాలు నిమగ్నమయ్యాయి.