Telangana: పొలానికి నీళ్లు వేయడానికి బోర్ రిపేర్ చేయించాడు.. అది కాస్తా బావిలో పడింది.. దీంతో ఆ రైతు..
బోరుబావి మోటార్ పాడవడం, వరి పంట ఎండిపోవడం, అప్పుల భారం వంటి సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురైన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం శంకర్‌తండాకు చెందిన రైతు మాలోత్ శంకర్ (45) మృతి చెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న ఆ రైతుకు వరుస కష్టాలు ఎదురయ్యాయి. సాగునీటి కోసం ఆధారపడిన బోరుబావి పనిచేయకపోవడం.. కళ్లముందే వరి పంట ఎండిపోతుండటంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. ఇప్పటికే చేసిన అప్పులు, పంట నష్టంపై ఆందోళనతో మనస్తాపానికి గురైన రైతు ప్రాణాలు కోల్పోయాడు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం శంకర్‌తండాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్‌తండాకు చెందిన మాలోత్ శంకర్ (45)కు రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో రెండు బోరుబావుల సాయంతో వరి సాగు చేస్తున్నారు. అయితే, ఐదు రోజుల క్రితం ఒక బోరుబావిలోని మోటార్ కాలిపోయింది. దీంతో రిపేర్ చేయించిన అనంతరం మోటార్‌ను తిరిగి బోరుబావిలోకి దించుతుండగా ప్రమాదవశాత్తూ చేతి నుంచి జారిపోయింది. మోటార్‌తో పాటు నాలుగు పైపులు కూడా బోరుబావిలో పడిపోయాయి. బోరుబావిలో పడిపోయిన మోటార్, పైపులను బయటకు తీసేందుకు మార్గం లేకపోవడంతో ఆ బోరు నిరుపయోగంగా మారింది. దీంతో వరి పంటకు సక్రమంగా నీరు అందక పైరు ఎండిపోవడం ప్రారంభమైంది. ఒకవైపు పంట నష్టం.. మరోవైపు వ్యవసాయం కోసం చేసిన అప్పులు శంకర్‌ను ఆందోళనకు గురిచేశాయి.
తీవ్ర మనస్తాపంతో ఇంటి నుంచి వెళ్లి..
ఈ సమస్యల నేపథ్యంలో శంకర్ గత కొన్ని రోజులుగా తీవ్ర మనోవేదనకు గురైనట్లు తెలుస్తోంది. కుటుంబంలోనూ గత మూడు రోజులుగా గొడవలు జరిగినట్లు సమాచారం. పంట చేతికందే సమయంలో ఎదురైన ఇబ్బందులు, అప్పుల భారం, కుటుంబ పరిస్థితులతో ఆయన తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లారు. బుధవారం ఉదయం తన పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందిన స్థితిలో కనిపించారు. శంకర్‌ను ఆ స్థితిలో చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
కేసు నమోదు చేసిన పోలీసులు
సమాచారం అందుకున్న శివ్వంపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు శంకర్‌కు భార్య పద్మ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబానికి జీవనాధారంగా ఉన్న రైతు ఆకస్మిక మరణంతో శంకర్‌తండాలో విషాదం నెలకొంది. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుని తగిన సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Shankar
