Telangana: సర్పంచ్ అయిన డాక్టరమ్మ.. ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన ఎంబీబీఎస్ స్టూడెంట్

ఇటీవలే ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో యువ వికాసం విరిసింది. విద్యావంతులు గ్రామ సేవ కోసం క్యూ కట్టారు. తొలిసారి రాజకీయ రంగ ప్రవేశం చేసి. సత్తా చాటారు. వనపర్తి జిల్లాలో ఎంబీబీఎస్ స్టూడెంట్ సర్పంచ్‌గా ఎన్నికై సత్తా చాటింది. అటు చదువు.. ఇటు గ్రామాభివృద్ధి గురించి ఆమె కీలక విషయాలు వెల్లడించింది.

Telangana: సర్పంచ్ అయిన డాక్టరమ్మ.. ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన ఎంబీబీఎస్ స్టూడెంట్
Mbbs Student Elected As Sarpanch

Edited By:

Updated on: Dec 19, 2025 | 2:04 PM

ఈ రోజుల్లో యువత అనగానే చదువు, ఉపాధి, ఉద్యోగం పేరుతో పట్టణాలకే పరుగులు పెడుతున్నారు. అక్కడే స్థిరపడిపోయి గ్రామాల వైపు కనీసం తొంగి చూడడం లేదు. మహా అయితే పండుగలు, శుభకార్యాలకు అలా వచ్చి.. ఇలా వెళ్ళిపోతున్నారు. రాష్ట్రంలో చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక రాజకీయాలకు అయితే చాలా దూరంగా ఉంటున్నారు. ఇలాంటి సందర్భంలో ఇటీవలే ముగిసిన పంచాయతీ ఎన్నికలు కొంత మార్పును తీసుకువచ్చాయి. రిజర్వేషన్లు, గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచి గెలిచారు.

వనపర్తి జిల్లాలో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థిని ఎన్నికల బరిలో నిలిచి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంతే కాదు ఎన్నికలలో మంచి మెజారిటీ తో గెలిచి నిలిచింది. పెబ్బేరు మండలం శాఖాపూర్(వై) గ్రామానికి చెందిన యువతి కేఎన్ నిఖిత సర్పంచ్‌గా ఎన్నికైంది. వాస్తవంగా నిఖిత ప్రస్తుతం నాగర్ కర్నూల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతోంది. నిఖిత తండ్రి రాజేంద్ర ప్రసాద్ డిప్యూటీ తహసిల్దార్‌గా, తల్లి చిలకమ్మ టీచర్‌గా పనిచేస్తున్నారు. చిన్న వయసులోనే అందులో వైద్య వృత్తి ఎంచుకొని సర్పంచ్ స్థానానికి పోటీ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

గ్రామంలో ఉన్న యువత ఉద్యోగాలు, ఉపాధి అంటూ వెళ్తే.. ఊరిని ఎవరు ఉద్దరిస్తారని ప్రశ్నించి బరిలో నిలిచింది నిఖిత. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు, అధికార పార్టీ మద్దతుతో సర్పంచ్‌గా విజయం సాధించింది. ఇక సర్పంచ్‌గా గ్రామ అభివృద్ధిపై ఫోకస్ పెడతానని నిఖిత చెబుతోంది. ప్రధానంగా డ్రైనేజ్, తాగునీటి సరఫరా, రవాణా సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపింది. అటు వైద్య విద్య, ఇటు సర్పంచ్ పదవి రెండు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని ధీమా వ్యక్తం చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..