AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: వారందరికీ తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. జీతం పెంపు.. తక్షణమే అమల్లోకి

మే డే సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్ చెప్పింది. జీతాలు పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. అలానే ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ గడువు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Telangana: వారందరికీ తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. జీతం పెంపు.. తక్షణమే అమల్లోకి
Telangana CM KCR
Ram Naramaneni
|

Updated on: May 01, 2023 | 6:23 PM

Share

మే డే కానుకగా.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,06,474 మంది పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలను నెలకు తలా 1000 ( వెయ్యి) రూపాయల చొప్పున పెంచాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. జిహెచ్ఎంసి, మెట్రో వాటర్ వర్క్స్ తో పాటు, రాష్ట్రంలోని మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలల్లో పనిచేస్తూ ప్రస్తుతం జీతం అందుకుంటున్న పారిశుద్ధ్య కార్మికులందరికీ నెల నెలా పెరిగిన వేయి రూపాయల వేతనం అదనంగా జీతంతో పాటు కలిపి అందుతుందని సీఎం తెలిపారు. పెరిగిన వేతనాలు తక్షణమే అమలులోకి వస్తాయని సిఎం తెలిపారు. త్వరలోనే రాష్ట్రంలోని ఆర్టిసి కార్మికుల జీతాలు కూడా పెంచాలని నిర్ణయించామని, ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్థిక శాఖను ఆదేశించినట్లు సీఎం తెలిపారు.

ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ గడువు పొడిగింపు

హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల పరిధిలోని మున్సిపాలిటీల్లో ఉన్న పేదల ఇండ్ల నిర్మాణం కోసం ఇబ్బందులు లేకుండా, నిబంధనల మేరకు ఇంటి స్థలాలను క్రమబద్ధీకరించి, వారికి న్యాయపరమైన హక్కులను కల్పిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి నోటరీ స్థలాలను జీఓ 58, 59 ల ప్రకారం క్రమబద్ధీకరించుకోవడానికి మరో నెల రోజులపాటు గడువు పొడిగిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను సీఎం కోరారు. తక్షణమే తమ తమ నియోజకవర్గాల పరిధుల్లోని ఎమ్మెల్యేలను కలిసి తమకున్న నోటరీ, తదితర ఇండ్ల స్థలాల రెగ్యులరైజేషన్ సమస్యలను ప్రజలు తెలుపుకోవాలన్నారు. అన్ని సమస్యలను క్రోడీకరించి, పరిష్కరించి, వారికి న్యాయపరమైన హక్కులతో కూడిన పట్టాలను ప్రభుత్వం అందజేస్తుందని సీఎం తెలిపారు.

ఏకకాలంలో ఒకే మొత్తంలో పేదల ఇండ్ల సమస్యలు పరిష్కారం కావాలనేది ప్రభుత్వ ఉద్దేశ్యమని సీఎం అన్నారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే సందర్భంలో వ్యవసాయ భూముల నోటరీ సమస్యలను కూడా పరిష్కరిస్తామని సీఎం అన్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించి కలెక్టర్ల కాన్ఫరెన్సు నిర్వహించనున్నామని తెలిపారు. ఈ మేరకు ఈరోజు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలోని ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తి మేరకు నోటరీ, 58, 59 జీఓలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికై సానుకూలంగా స్పందించారు. మరో నెల రోజుల గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ చక్కని అవకాశాన్ని పేదలందరూ సద్వినియోగం చేసుకోవాలని సీఎం మరోసారి కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం