
మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో తీవ్ర కలకలం రేగింది. ఏనికపల్లి గ్రామంలోని ఓ వరి పొలంలో ఏకంగా భారీ మొసలి ప్రత్యక్షమవడంతో స్థానిక రైతులు, కూలీలు భయాందోళనలకు గురయ్యారు. వరి కోతలకు సిద్ధమవుతున్న తరుణంలో పొలంలో భారీ మొసలి కనిపించడంతో ఒక్కసారిగా గ్రామమంతా అలజడి మొదలైంది. అయితే అటవీ శాఖ అధికారులు సకాలంలో స్పందించి, ప్రత్యేక బృందాన్ని రప్పించి మొసలిని సురక్షితంగా పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఏనికపల్లి పరిసరాల్లో బుధవారం ఉదయం ఓ రైతు తన వరి పొలంలో పని చేస్తుండగా ఈ మొసలి కనిపించింది. పంట చేల మధ్య కదలికలు గమనించిన సదరు రైతు దగ్గరికెళ్లి చూడగా అది మొసలి అని తేలింది. దీంతో హడలిపోయిన ఆయన వెంటనే మిగతా రైతులకు, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. పంట చేలో మొసలి వచ్చిందన్న వార్త దావానలంలా వ్యాపించడంతో దానిని చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు.
సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే, పొరుగున ఉన్న సంగారెడ్డి జిల్లా నుంచి మొసళ్లను పట్టుకోవడంలో అనుభవజ్ఞులైన ప్రత్యేక రెస్క్యూ టీమ్‌ను రప్పించారు. ఆ బృందం చాకచక్యంగా వలలు, తాళ్ల సాయంతో మొసలికి ఎలాంటి గాయాలు కాకుండా బంధించింది. అనంతరం దానిని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. మొసలి పట్టుబడటంతో పంట కోతలకు వెళ్లే రైతులు, వ్యవసాయ కూలీలు ఊపిరి పీల్చుకున్నారు.
సమీపంలో ఉన్న మంజీర నదిలో నీటి మట్టం తగ్గడం లేదా ఆహారం వెతుక్కుంటూ కాల్వల ద్వారా ఈ మొసలి పంట పొలాల్లోకి ప్రవేశించి ఉంటుందని స్థానిక రైతులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ హేమచందన మాట్లాడుతూ.. మంజీర పరివాహక ప్రాంతాల్లోని రైతులు, మత్స్యకారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. నదీ తీరాల్లో గానీ, చెరువులు, పంట కాలువల సమీపంలో గానీ మొసళ్లు కనిపిస్తే ప్రజలు స్వయంగా పట్టుకునే సాహసం చేయవద్దని, వెంటనే అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచించారు. కాగా మంజీర నది పరివాహక ప్రాంతంలో మొగ్గర్ జాతి మొసళ్ల సంఖ్య గత కొన్నేళ్లుగా గణనీయంగా పెరిగింది. ప్రసిద్ధ మంజీర వన్యప్రాణి అభయారణ్యం పరిధిలోని నదీ ప్రవాహాల నుంచి వరదలు వచ్చినప్పుడు లేదా నీటిమట్టాలు మారినప్పుడు ఇవి సమీప గ్రామాల వైపు రావడం పరిపాటిగా మారింది.