Hyderabad: హైఅలర్ట్.. హైదరాబాద్‌కు వరుస బాంబు బెదిరింపులు..

హైదరాబాద్‌లో వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. రాజ్ భవన్, సిటీ సివిల్ కోర్టు, జడ్జి చాంబర్స్, జింఖానా క్లబ్, జడ్జి క్వార్టర్స్‌‌లో బాంబులు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్ చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో త‌నిఖీలు చేపట్టారు.

Hyderabad: హైఅలర్ట్.. హైదరాబాద్‌కు వరుస బాంబు బెదిరింపులు..
Hyderabad

Updated on: Jul 08, 2025 | 2:04 PM

హైదరాబాద్‌‌లో ఒక్కసారిగా అలజడి రేగింది. వరుస బాంబు బెదిరింపులు నగరాన్ని హడలెత్తించాయి. రాజ్ భవన్, సిటీ సివిల్ కోర్టు, జడ్జి చాంబర్స్, జింఖానా క్లబ్, జడ్జి క్వార్టర్స్‌‌లో బాంబులు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్ చేశారు. మొదట సిటీ సివిల్ కోర్టులో బాంబు పెట్టిన‌ట్లు దుండ‌గుడు ఫోన్ చేసి బెదిరించాడు.  ‘‘కోర్టులో బాంబులు పెట్టాం. కాసేపట్లో అవి పేలిపోతాయి’’ అంటూ దుండగుడు ఫోన్ చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కోర్టు సిబ్బందిని బయటకు పంపి.. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో త‌నిఖీలు చేపట్టారు. ప్రతి గదిని క్షున్నంగా తనిఖీ చేస్తున్నారు.  ఆ తర్వాత కాసేపటికే అబీదా అబ్దుల్లా పేరుతో మెయిల్ వచ్చింది. ఆ మెయిల్లో సిటీ సివిల్ కోర్టు, జడ్జి చాంబర్స్, జింఖానా క్లబ్, జడ్జి క్వార్టర్స్‌‌లో ఆర్డీఎక్స్ బాంబులు పెట్టినట్లు ఉంది.

ఈ క్రమంలో మరో మెయిల్ వచ్చింది. గవర్నర్ నివాసం ఉండే రాజ్ భవన్‌లో ఆర్డీఎక్స్, ఐఈడీ బాంబులు పెట్టినట్లు ఆ మెయిల్ సారాంశం. వెంటనే అప్రత్తమైన పోలీసులు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీ చేస్తున్నారు. అగంతకుడు నిజంగా బాంబులు పెట్టాడా లేక బెదిరిస్తున్నాడా అన్నది పోలీసుల తనిఖీల్లో బయటపడనుంది. గతంలోనూ శంషాబాద్ ఎయిర్ పోర్టులో బాంబు పెట్టినట్లు పలుసార్లు బెదిరింపులు వచ్చాయి. అయితే అవన్నీ ఉత్తవేనని.. ఎటువంటి బాంబు పెట్టలేదని పోలీసులు తేల్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి..