Telangana: అప్పు ఎప్పటికీ ముప్పే.. తీసుకున్న డబ్బు కట్టలేక భార్య పిల్లల్ని చంపి భర్త ఆత్మహత్య!

మహబూబ్‌నగర్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అప్పుల బాధ, అనారోగ్య కారణాలతో భార్య, పిల్లలను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పులు ఇచ్చిన వారి వేధింపులకు తాళ లేక ఘాతుకానికి పాల్పడుతున్నట్లు సెల్ఫీ వీడియోలో వెల్లడించాడు. ఖిల్లా ఘనపురం మండలం సలికేలపురం గ్రామ శివారులోని మామిడి తోటలో అర్దరాత్రి తర్వాత ఘటన జరిగింది. ఇది స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Telangana: అప్పు ఎప్పటికీ ముప్పే.. తీసుకున్న డబ్బు కట్టలేక భార్య పిల్లల్ని చంపి భర్త ఆత్మహత్య!
Mahabubnagar Family Tragedy

Edited By:

Updated on: May 27, 2026 | 7:01 PM

అప్పుల బాధతో ఓ ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. దేవరకద్ర మండలం డోకూరు గ్రామానికి చెందిన గంగుల నరసింహ అనే వ్యక్తి మామిడి తోటలు లీజుకు తీసుకొని జీవనం సాగించేవాడు. ఇతనికి భార్య ఎల్లమ్మ, కుమారుడు సాయి నిహాల్, కూతురు సాహితీ శ్రీ ఉన్నారు. గడిచిన కొన్ని ఏళ్లుగా షాద్ నగర్, ఖిల్లా ఘనపురం మండలంలో పలు మామిడి, జామ పండ్ల తోటలు కౌలుకు పండిస్తున్నాడు నరసింహా. సుమారు 200 ఎకరాల వరకు తోటలను నరసింహ నిర్వహిస్తున్నాడు.

అయితే కరోనా సమయం తర్వాత మామిడి తోటల్లో నష్టాలు వస్తున్నాయి. దీనికి తోడు నరసింహ, ఆయన భార్య ఎల్లమ్మ అనారోగ్య సమస్యలు వచ్చాయి. దీంతో అటు నష్టాలు పూడ్చుకోవడానికి, ఇటు ఆస్పత్రిలో చికిత్స కోసం అప్పులు చేయడం మొదలు పెట్టాడు. స్వగ్రామం డోకూర్ తో పాటు గద్వాల ప్రాంతంలో తెలిసిన వారి వద్ద సుమారు రూ.80 లక్షల వరకు అప్పులు చేశాడు. దానికి వడ్డీలు అన్ని కలిపి సుమారు కోటికి పైగా చేరుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఓ ప్రైవేట్ బ్యాంకు లో హౌసింగ్ లోన్ సైతం తీసుకున్నాడు.

అయితే అప్పులు ఇచ్చిన వారు డబ్బులు తిరిగి చెల్లించాలని అడగడం స్టార్ట్ చేశారు. దీంతో కిందామీదా పడి గద్వాలలో తెచ్చిన అప్పులను తిరిగి కట్టేసాడు. కానీ గ్రామంలోని అప్పులు కట్టలేక పోయాడు. దీంతో గ్రామంలో అప్పులు ఇచ్చిన వాళ్ళు తనను చంపుతామని బెదిరిస్తున్నారని చనిపోయే ముందు సెల్ఫీ వీడియోలో తెలిపాడు. అందరి అప్పులు చెల్లిస్తానని ఎగ్గొట్టే ఆలోచన లేదని చెప్పినా ఎవరు వినడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. హౌసింగ్ లోన్ చెల్లించకపోవడంతో ఇంటికి నోటీసు అంటించారని. అయితే కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చానని.. IP పెట్టే ఆలోచన లేదని చెప్పిన వేధింపులు తగ్గలేదని చెప్పుకొచ్చాడు.

ఇక వేధింపులు ఎక్కువ కావడంతో చనిపోవాలని నరసింహ నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం నివాసం ఉంటున్న సలికేలపురం గ్రామ శివారులోని మామిడి తోటలో అర్దరాత్రి తర్వాత భార్య, ఇద్దరు పిల్లల చేతులు, కాళ్ళు కట్టేసి నీటి సంపులో పడేసాడు. వారు చనిపోయారని ధృవీకరించుకున్న తర్వాత కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. తాను చనిపోతున్నాని చెప్పి కాల్ కట్ చేశాడు. అక్కడే ఉన్న కంటైనర్ హోం కు ఉరి వేసుకొని నరసింహ ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు వచ్చే సరికి భార్య, పిల్లలు, నరసింహ నలుగురు చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వేధింపులకు గురిచేసిన వారిపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు.అప్పుల బాధలు, అనారోగ్య సమస్యల కారణంగా ఓ కుటుంబం మొత్తం బలవ్వడంతో ఉమ్మడి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us