Secunderabad MP Candidate : సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే పేరు ఖరారు

లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ దూకుడుపెంచింది. పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అయా నియోజకవర్గాల నేతలతో సమావేశమైన కేసీఆర్.. ఎంపీ అభ్యర్థులను ఫైనల్‌ చేస్తున్నారు. తాజాగా సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి పార్టీ అభ్యర్థిని ప్రకటించారు

Secunderabad MP Candidate : సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే పేరు ఖరారు
Kcr Padmarao Goud

Updated on: Mar 23, 2024 | 6:19 PM

లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ దూకుడుపెంచింది. పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అయా నియోజకవర్గాల నేతలతో సమావేశమైన కేసీఆర్.. ఎంపీ అభ్యర్థులను ఫైనల్‌ చేస్తున్నారు. తాజాగా సికింద్రాబాద్, భువనగిరి, నల్గొండ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది బీఆర్ఎస్. సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి, ప్రస్తుత సికింద్రాబాద్ శాసన సభ్యుడు తీగుళ్ల పద్మారావు గౌడ్‌, భువనగిరి నుంచి క్యామ మల్లేశ్‌, నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి పోటీ చేస్తారని అధినేత కేసీఆర్‌ ప్రకటించారు. ఈ మేరకు పార్టీ శాసన సభ్యులు ప్రజాప్రతినిధులు ఇతర ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో చర్చించి అందరి అభిప్రాయం సేకరించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.

పార్టీ సీనియర్ నేతగా నాటి ఉద్యమ కాలం నుంచి నేటి వరకు పార్టీకి విధేయుడుగా వున్న పద్మారావు గౌడ్ అందరివాడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. సికింద్రాబాద్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన నిబద్ధతకలిగిన స్థానిక నేతగా ఆ ప్రాంత ప్రజలు బస్తీవాసులందరికీ పజ్జన్న’గా ఆదరాభిమానాలు పొందిన పద్మారావు గౌడ్‌ను సరియైన అభ్యర్థిగా సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. అందరి ఏకాభిప్రాయం మేరకు సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావు గౌడ్‌ను బరిలోకి దింపాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ప్రస్తుతం సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పద్మారావు గౌడ్ కొనసాగుతున్నారు. అటు సికింద్రాబాద్ లోక్‌సభ స్థానంలో బీజేపీ తరఫున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి ఇటీవలె బీఆర్ఎస్ వీడిన సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బరిలో ఉన్నారు.

ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో గ్రేటర్ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థుల ఎంపిక పై బిఅర్ఎస్ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఅర్. సికింద్రాబాద్, మల్కాజిగిరి, హైదరాబాద్ నియోజకవర్గాల నాయకులతో సమావేశం అయ్యారు. మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, వెంకటేశం, ఆనంద్ గౌడ్, ముఠాగోపాల్, దాసోజి శ్రవణ్ తో పాటు కొందరు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు పాల్గొన్నట్లు సమాచారం.

లోక్‌సభ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఇక ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ 16 మంది అభ్యర్థులను ఖరారు చేసింది.

బీఆర్ఎస్ ప్రకటించిన ఎంపీ అభ్యర్థులు వీరే..

  1. చేవెళ్ల – కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాబాద్
  2. వరంగల్ (ఎస్సీ ) – డాక్టర్ కడియం కావ్య
  3. మల్కాజ్ గిరి – రాగిడి లక్ష్మారెడ్డి
  4. ఆదిలాబాద్ – ఆత్రం సక్కు
  5. జహీరాబాద్ – గాలి అనిల్ కుమార్
  6. నిజామాబాద్ – బాజిరెడ్డి గోవర్ధన్
  7. కరీంనగర్ – బోయినిపల్లి వినోద్ కుమార్
  8. పెద్దపల్లి(ఎస్సీ) – కొప్పుల ఈశ్వర్
  9. మహబూబ్‌ నగర్ – మన్నె శ్రీనివాస్ రెడ్డి
  10. ఖమ్మం – నామా నాగేశ్వరరావు
  11. మహబూబాబాద్(ఎస్టీ) – మాలోత్ కవిత
  12. మెదక్ – వెంకట్రామిరెడ్డి
  13. నాగర్ కర్నూలు – ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
  14. సికింద్రాబాద్ – తీగుళ్ళ పద్మారావు గౌడ్
  15. భువనగిరి – క్యామ మల్లేశ్‌
  16. నల్గొండ – కంచర్ల కృష్ణారెడ్డి

తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు గానూ ఇప్పటి వరకు బీఆర్ఎస్ 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన ఒక్క హైదరాబాద్ స్థానానికి త్వరలోనే అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. ఇక్కడ్నుంచి పలువురు నేతలు టికెట్లు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ స్థానాని నుంచి కేసీఆర్ ఎవరికి అవకాశం ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…