Lockdown Exemptions: తెలంగాణలో లాక్‌డౌన్‌ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన డీజీపీ.. వారికి మాత్రమే మినహాయింపులు..!

|

May 24, 2021 | 6:48 AM

లాక్‌డౌన్ ఆంక్షలు కఠినతరం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. అన్ని వర్గాలను రోడ్డెక్కెందుకు అనుమతి ఇవ్వడంలేదు. తాజాగా ఫుడ్‌ డెలివరీ, ఈ-కామర్స్‌ సంస్థల సిబ్బందికి మినహాయింపు కల్పించారు పోలీసులు.

Lockdown Exemptions: తెలంగాణలో లాక్‌డౌన్‌ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన డీజీపీ.. వారికి మాత్రమే మినహాయింపులు..!
visakhapatnam police
Follow us on

Telangana Lockdown exemptions: లాక్‌డౌన్ ఆంక్షలు కఠినతరం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. అన్ని వర్గాలను రోడ్డెక్కెందుకు అనుమతి ఇవ్వడంలేదు. అత్యవసరం మినహా అనవసరంగా బయట తిరిగే వాహనాలను గుర్తించి సీజ్‌ చేయాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. అయితే, శనివారం నుంచి అనేక ప్రాంతాల్లో స్విగ్గి, జోమాటో, ఇతర వస్తువుల డెలివరీ చేసే ఈ కామర్స్ వాహనాలను పోలీసులు నిలిపివేశారు. రోడ్లపైకి వచ్చిన వాహనాలు సీజ్ చేశారు. లాక్ డౌన్ ఎత్తివేసేవరకు మళ్లీ వాహనాలను తిరిగి ఇవ్వమని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు.

అయితే, లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలని కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. అటు, ఈక్రమంలో ఫుడ్‌ డెలివరీ నిలిపివేసేందుకు ఆయా సంస్థలు మొగ్గు చూపాయి. అలాగే విద్యుత్తు, వైద్యం వంటి ప్రభుత్వ విభాగాల్లో అత్యవసర సేవల సిబ్బందికీ మినహాయింపు ఇవ్వలేదు. ఈ పద్ధతుల పట్ల పలు చోట్ల నిరసనలు వ్యక్తం కావడంతో ఆదివారం పోలీసులు కొంత వెనక్కి తగ్గారు. ఫుడ్‌ డెలివరీ, ఈ-కామర్స్‌ సంస్థల సిబ్బందికి మినహాయింపు కల్పించారు. ప్రభుత్వ విభాగాల్లోని అత్యవసర సేవల సిబ్బందికీ ఇచ్చారు.

లాక్‌డౌన్‌ సమయాన ఆటోలో, కారులో, ద్విచక్ర వాహనంపై వెళ్లే వారు ఈ పాసులు కచ్చితంగా కలిగి ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. లేదంటే జరిమానా విధించి వెనక్కు పంపిస్తామన్నారు. వైద్యం కోసం వెళ్లేవారి వద్ద డాక్టర్‌ అపాయింట్‌మెంట్‌ ఉండాలి. అనారోగ్యంతో బాధపడేవారు, వారి సహాయకులు ఇటీవలి మెడికల్‌ డాక్యుమెంట్లు చూపాలి. డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదివారం నగరంలోని ముగ్గురు పోలీస్‌ కమిషనర్లతో సమీక్ష నిర్వహించారు. కఠిన లాక్‌డౌన్‌ అమలుకు తాజా మార్గదర్శకాలను జారీచేశారు.

తెలంగాణ పోలీసుల కొత్త మార్గదర్శకాలు

❁ వైద్యులను తనిఖీలు లేకుండా పంపండి.

❁ అత్యవసర సేవలు అందించేవారిని ఎలాంటి తనిఖీలు లేకుండా అనుమతి.

❁ వైద్యులు, నర్సులు, ఆసుపత్రి సిబ్బంది, స్వీపర్లు, ఫార్మాసిస్టులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఆసుపత్రి సూపర్‌వైజర్లు, మేనేజర్లు, ఆక్సిజన్‌ టెక్నీషియన్లు, మెడికల్‌ దుకాణాల సిబ్బంది ఇందులో ఉన్నారు.

❁ ప్రయివేటు ల్యాబ్‌టెక్నీషియన్లు, నమూనాలు సేకరించేవారిని ఐడీ కార్డులు క్షుణ్ణంగా తనిఖీ చేశాకే వదలాలి.

❁ ప్రభుత్వ ఉద్యోగులు, ట్యాక్సీ ప్లేట్‌ వాహనంలో వెళ్లే ఎయిర్‌పోర్టులో పనిచేసే ఉద్యోగులు, పైలట్‌లు ఇతరులను అనుమతి.

❁ నిర్మాణ రంగంలో పనిచేసే ఉద్యోగులు, కూలీలు, ఇతరులు పనులు ముగించుకొని ఇంటికి తిరుగు పయనమయ్యే సమయంలో వెసులుబాటు కల్పించాలి.