Telangana Budget: రాష్ట్ర రైతులకు తీపి వార్త చెప్పింది తెలంగాణ సర్కార్. రూ.లక్ష వరకు రుణాన్ని మాఫీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు రూ.25 వేలు, రూ.50 వేలు ఉన్నవారిలో కొందరికే మాఫీ జరిగింది. దీనిపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో స్పష్టత ఇచ్చారు. రూ.50వేల లోపు రైతు రుణాలు మార్చిలోపు మాఫీ చేస్తామని ప్రకటించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.75వేల లోపు పంట రుణాలు మాఫీ చేస్తామని తెలిపారు. మొత్తంగా రూ.16,144 కోట్ల పంట రుణాలు మాఫీ చేస్తామని, దీనిద్వారా 5.12లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగానికి గత ఏడేళ్లుగా ప్రభుత్వం పెద్ద ఎత్తున బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తోంది. ఎనిమిది వ్యవసాయ సీజన్లలో రైతు బంధు పథకం కింద 50,448 కోట్ల రూపాయలను 63 లక్షల మంది రైతుల ఖాతాల్లో సర్కార్ జమచేసింది. రైతు భీమా పథకం ద్వారా రైతు మరణిస్తే వారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నామని హరీశ్ రావు తెలిపారు. ఇప్పటి వరకు 75 వేల కుటుంబాలకు 3,775 కోట్ల రూపాయలను ప్రభుత్వం అందజేసినట్లు వివరించారు. గతేడాది వ్యవసాయ రంగానికి రూ.25వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈ ఏడాది(2022-23)కి రూ.24,254 కోట్లు ప్రతిపాదించింది. తెలంగాణ ప్రభుత్వం రైతలకు అండగా ఉంటుందని చెప్పిన మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.
Also Read: Telangana Budget: రూ.2.56 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్.. టాప్ 30 హైలెట్స్ మీ కోసం