బూందీ మిక్చర్‌లో కరకరలాడే బల్లి.. స్వీట్‌ షాప్‌పై కేసు, భారీ జరిమానా

పండగలు, ఫంక్షన్లు ఇలా ప్రతి శుభకార్యంలోనూ స్వీట్లు, బూందీ మిక్చర్‌ తప్పనిసరిగా ఉంటాయి. ఇంట్లో తయారు చేయలేని వారు దాదాపు అందరూ స్వీట్ షాపుల నుంచే తెచ్చుకుంటారు. అలాంటి వారు ఈ వార్త చదవాల్సిందే. ఎందుకంటే ఓ స్వీట్‌ షాపువాళ్లు తయారు చేసిన బుందీ మిక్చర్‌లో నూనెలో బాగా వేయించిన కరకరలాడే బల్లి ప్రత్యక్షం కావడంతో అంతా షాకయ్యారు. ఈ సంఘటన సిరిసిల్ల పట్టణంలో ఓ స్వీట్‌హౌస్‌లో వెలుగులోకి వచ్చింది..

బూందీ మిక్చర్‌లో కరకరలాడే బల్లి.. స్వీట్‌ షాప్‌పై కేసు, భారీ జరిమానా
Lizard In Boondi Mixture

Updated on: Jul 02, 2026 | 4:48 PM

సిరిసిల్ల, జూలై 2:  స్థానిక స్వీట్ షాపులో కొనుగోలు చేసిన బూందీ మిక్చర్‌లో బాగా వేయించిన బల్లి కళేబరం బయటపడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై ఆహార భద్రతా అధికారులు, మున్సిపల్‌ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి సదరు దుకాణాన్ని సీజ్‌ చేయడంతో పాటు నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు. స్థానికులు అందించిన వివరాల ప్రకారం..

సిరిసిల్లరే చెందిన అరుణ్‌చంద్‌ అనే వ్యక్తి స్థానికంగా ఉన్న గాంధీచౌక్‌లోని బాలాజీ స్వీట్‌ హౌస్‌లో బూందీ మిక్చర్‌, రింగ్స్‌ తదితర తినుబండారాలు కొనుగోలు చేశాడు. ఇంటికి వెళ్లి వాటిని పరిశీలించగా బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం కనిపించింది. దీంతో షాక్‌కు గురైన బాధితుడు వెంటనే స్వీట్‌హౌస్‌కు వెళ్లి నిర్వాహకుడిని ప్రశ్నించాడు. అయితే ఆయన నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో పాటు దురుసుగా ప్రవర్తించాడు. దీంతో బాధితుడు ఆహార భద్రతా అధికారులను ఆశ్రయించాడు. సమాచారం అందుకున్న ఆహార భద్రతా అధికారి అనూష, మున్సిపల్‌ అధికారులతో కలిసి బాలాజీ స్వీట్‌హౌస్‌లో బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఆహార పదార్థాల నమూనాలను సేకరించి పరీక్షల కోసం పంపించారు. నాణ్యత లేని ఆహార పదార్థాలను అక్కడికక్కడే తొలగించారు. అనంతరం తయారీ కేంద్రంతో పాటు దుకాణాన్ని సీజ్‌ చేశారు.

ప్రాథమిక విచారణ అనంతరం ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించినందుకు స్వీట్‌హౌస్‌ యజమానిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా మున్సిపల్‌ అధికారులు రూ.1 లక్ష జరిమానా విధించినట్లు వెల్లడించారు. ఈ ఘటన పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే పానీపూరి తిని 20 మందికిపైగా అస్వస్థతకు గురైన సంఘటన మరువకముందే మరో ఆహార భద్రతా లోపం వెలుగులోకి రావడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కలుషితమైన బూందీ తిన్న ఇద్దరు చిన్నారులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. నిరంతర పర్యవేక్షణ, తనిఖీలు లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు విమర్శించారు. ఆహార భద్రతా నిబంధనలు పాటించని హోటళ్లు, స్వీట్‌హౌస్‌లు, ఫుడ్‌ ఔట్‌లెట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే వారిపై నిరంతర నిఘా ఉంచాలని స్థానికులు డిమాండ్‌ చేశారు.

Follow Us