డంపింగ్ యార్డ్ సమీపంలో పిల్లలకు జన్మనిచ్చిన చిరుత.. ఎంత క్యూట్‌గా ఉన్నాయో కదా

| Edited By: Ram Naramaneni

Sep 23, 2023 | 9:43 AM

శివంగలపల్లి శివారులో చిరుత పులి సంచారం ఇప్పుడు టెన్షన్ రేపుతోంది. సబ్ స్టేషన్ ఎదుట ఉన్న డంపింగ్ యార్డ్ సమీపంలో ఓ చిరుత రెండు పిల్లలకు జన్మనిచ్చింది. పిల్లను చిరుత తన నోట కరచుకుని తీసుకువెళ్తుండగా.. రైతు గమనించి.. కేకలు వేశాడు. దీంతో ఒక పిల్లను అక్కడే వదిలేసి వెళ్లింది చిరుత. విషయం తెలియడంతో స్థానికులు బుల్లి చిరుతను చూసేందుకు క్యూ కట్టారు. ఫారెస్ట్ అధికారులు కూడా రంగంలోకి దిగారు.

డంపింగ్ యార్డ్ సమీపంలో పిల్లలకు జన్మనిచ్చిన చిరుత.. ఎంత క్యూట్‌గా ఉన్నాయో కదా
Leopard Cubs
Follow us on

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల శివారు అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచారంతో ప్రజలు ఉలిక్కి పడ్డారు. మండల కేంద్రం సమీపంలో చిరుతపులి రెండు పిల్లలకు జన్మనినచ్చిందన్న సమాచారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. పులి పిల్లలను చూసేందుకు భారీగా తరలివచ్చారు సమీప గ్రామాల ప్రజలు. చిరుత పులి పిల్లను ఆసక్తిగా చూస్తూ.. సెల్పీలు తీసుకున్నారు. మండల కేంద్రం నుండి శివంగాలపల్లి గ్రామానికి వెళ్లే దారి పక్కన ఉన్న డంపింగ్ యార్డ్ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో చిరుతపులి రెండు పిల్లలకు జన్మనిచ్చింది. తెల్లవారుజామున తల్లి చిరుత ఒక్క పిల్లను తీసుకుని వెళ్తుండగా.. పొలం పనుల కోసం వెళ్లిన ఓ రైతు చూసి గ్రామ సర్పంచ్‌కు సమాచారం ఇచ్చాడు. జనం అలజడి ఉండటంతో.. చిరుత ఒక పిల్లను అక్కడే వదిలేసి వెళ్లింది.  దీంతో ఆ  రైతు అక్కడే ఉండి తల్లి చిరుత మళ్లీ వస్తుందని.. రైతు కాస్త దూరం లో చెట్ల పొదల మాటున 2 గంటల పాటు చూసాడు. చిరుత రాకపోవడంతో పిల్ల చిరుతను జాగ్రత్తగా  సంరక్షించాడు. సమాచారం తెలుసుకున్న అటవీ అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు.

అప్పటికే చలికి వణికిపోతున్న చిరుతపులి పిల్లను సంరక్షించి, దానికి పాలు తాగించి, అదే ప్రాంతంలో పిల్లను వదిలిపెట్టారు. సిరిసిల్ల రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు, సెక్షన్ ఆఫీసర్ బాపురాజులు అక్కడికి వచ్చిన ప్రజలను పంపించి, తిరిగి చిరుతపులి అక్కడికి వచ్చేలా జనం అలికిడి లేకుండా చేశారు. చిరుతపులి వెళ్లిన ప్రాంతానికి మండల ప్రజలు ఎవ్వరూ రాకుండా, సంచరించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. తల్లి చిరుతపులి వచ్చి ఉన్న పిల్లను తీసుకవెళ్లుతుందని రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు తెలిపారు. చిరుత పులి వచ్చి పిల్లను తీసుకు వెళ్ళే వరకు ఇక్కడే పర్యవేక్షిస్తామని, చిరుత పులి వచ్చే దారిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి చూస్తామని పేర్కొన్నారు.

ఒక వేళ తల్లి చిరుత పులి రాని పక్షంలో కరీంనగర్‌కు తరలిస్తామన్నారు. ఇప్పటికే ఈ అటవీ ప్రాంతంలో ఆరు చిరుతపులులు ఉన్నాయని, మరో రెండు చిరుతపులి పిల్లలు రావడంతో వాటి సంఖ్య ఎనిమిది చేరినట్లు అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా చిరుత పులి పిల్ల కనిపించిన వార్త జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంమైంది. పిల్ల చిరుత కోసం తల్లి చిరుత వచ్చే అవకాశం ఉండటంతో… ఆయా ప్రాంతాల.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..