విద్యార్థుల ఇంటికి వెళ్లి పుష్పగుచ్చాలు ఇస్తున్న లెక్చరర్లు.. ఎందుకో తెలుసా..?

సాధారణంగా ప్రేయసి, ప్రియులు ప్రేమపూర్వకంగా బొకేలను ఇచ్చిపుచ్చుకుంటారు. గౌరవ అతిధులు, ఉన్నతాధికారులకు కూడా పూలు, బొకేలు ఇస్తుంటారు. మరి ముఖ్యంగా కాలేజీ యువత.. లవర్స్ కు పూల బొకేలు ఇవ్వడం కామన్. కానీ, ఇక్కడ మాత్రం కాలేజీ విద్యార్థుల ఇళ్లకు వెళ్లి లెక్చరర్లు పూల బొకేలు ఇస్తున్నారు. లెక్చరర్లు.. కాలేజీ విద్యార్థులకు ఎందుకు పూల బొకేలు ఇస్తున్నారో తెలుసు కోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

విద్యార్థుల ఇంటికి వెళ్లి పుష్పగుచ్చాలు ఇస్తున్న లెక్చరర్లు.. ఎందుకో తెలుసా..?
Lecturers Attract Students

Edited By: Jyothi Gadda

Updated on: Jan 22, 2025 | 8:57 PM

పట్టణ, గ్రామీణ ప్రాంతాలు అని తేడా లేకుండా పేరెంట్స్ తమ పిల్లలను చదివించేందుకు ప్రైవేటు స్కూల్స్, కాలేజీల వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో ప్రభుత్వ స్కూల్స్, కాలేజీల్లో విద్యార్థుల చేరిక తగ్గిపోతోంది. విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల కోసం టీచర్లు గ్రామాల్లో తిరుగుతూ బడిలో చేరాలని ప్రచారం చేస్తుంటారు. ఇందుకోసం ప్రభుత్వం బడిబాట అని కార్యక్రమాన్ని కూడా చేపడుతోంది. ప్రభుత్వ స్కూళ్లలో డ్రాప్ అవుట్ విద్యార్థులను మళ్ళీ స్కూలుకు రప్పించేందుకు టీచర్లు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చి తీసుకు వస్తుంటారు. డ్రాప్ అవుట్ అయిన విద్యార్థులను కాలేజీకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వ జూనియర్ లెక్చరర్లు వినూత్న ప్రయత్నం చేశారు.

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో ప్రతి ఏటా విద్యార్థుల చేరిక శాతం పడిపోతుంది. వివిధ కారణాలతో డుమ్మా కొట్టే, మధ్యలో చదువుమానేసిన విద్యార్థులు తరగతులకు హాజరయ్యేలా చేసేందుకు లెక్చరర్లు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంటర్ విద్యార్థుల పరీక్షలు సమీపిస్తుండడంతో మధ్యలో కాలేజీ మానేసిన విద్యార్థులను కాలేజీకి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు.  లెక్చరర్లే స్వయంగా విద్యార్థుల ఇళ్ల వద్దకు వెళ్లి వారికి పుష్ప గుచ్ఛాలు ఇచ్చి కాలేజీకి రావాలని కోరుతున్నారు. గరిడేపల్లి, పొనుగోడు, అబ్బిరెడ్డి గూడెం తదితర గ్రామాల్లో 15 మంది విద్యార్థుల ఇళ్లకు వెళ్లి పుష్ప గుచ్చాలు ఇచ్చి ఆహ్వానించారు.

ఇంటర్‌ బోర్డు అధికారుల ఆదేశాల మేరకు విద్యార్థుల హాజరుశాతాన్ని పెంచేందుకు ఈకార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని లెక్చరర్లు తెలిపారు. వివిధ కారణాలతో మధ్యలో చదువు మానేసిన విద్యార్థులను కాలేజీకి తీసుకువచ్చేందుకు మా ప్రయత్నమని లెక్చరర్లు చెబుతున్నారు. ఈ వినూత్న కార్యక్రమంలో లెక్చరర్లు మద్దిమడుగు సైదులు, కర్నాటి శ్రీనివాస్‌, ప్రసాద్‌, నర్సింహాచారి, అపర్ణ ఉన్నారు. నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్‌ కళాశాల లెక్చరర్లు చేపట్టిన వినూత్నకార్యక్రమాన్ని మరి కొన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు కూడా ఫాలో అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..