Telangana: కర్నూల్ విషాదం.. మృతులకు కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం.. ఒక్కొక్కరికి..

ప్రమాదంలో మరణించిన తెలంగాణ ప్రజల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తామని మంత్రి పొన్నం తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, సహాయక చర్యల కోసం హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం గాయపడిన వారికి కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.

Telangana: కర్నూల్ విషాదం.. మృతులకు కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం.. ఒక్కొక్కరికి..
Telangana Govt Announces Rs 5 Lakh Ex Gratia

Updated on: Oct 24, 2025 | 1:14 PM

కర్నూలు జిల్లా శివారు చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో 20మంది వరకు మరణించారు. ఈ క్రమంలో ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ ప్రజల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచింది. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున, గాయపడిన క్షతగాత్రులకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం అందజేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా, ప్రైవేట్ బస్సుల వేగ నియంత్రణ, భద్రతా చర్యలపై చర్చించేందుకు త్వరలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల రవాణా మంత్రులు, అధికారులతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.

శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్‌కు చెందిన ఓ ప్రైవేట్ బస్సు బైక్ ఢీకొట్టింది. ఈ క్రమంలో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ దారుణ ఘటనలో బైకర్ శివశంకర్‌తో సహా 20 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనమైనట్లు సమాచారం. ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులకు కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. బస్సులో నుంచి దూకడంతో ప్రయాణికుల కాళ్లు, తలకు గాయాలయ్యాయి. ఘటన తర్వాత ఆస్పత్రికి వచ్చిన 11 మంది బాధితుల్లో ప్రస్తుతం నలుగురికి వైద్యం కొనసాగుతోంది. స్వల్ప గాయాలైన మరికొందరు ప్రాథమిక చికిత్స అనంతరం తమ స్వస్థలాలకు బయలుదేరారు.

సీఎం – పీఎం దిగ్భ్రాంతి

సీఎం రేవంత్ రెడ్డి ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీ అధికారులతో మాట్లాడి తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బాధితుల కోసం హైదరాబాద్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను కూడా ఏర్పాటు చేశారు. గద్వాల కలెక్టర్, ఎస్పీని ఘటనాస్థలికి వెళ్లాలని ఆదేశించారు. ఈ ఘోర ప్రమాదంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున ప్రధాని సహాయ నిధి నుంచి పరిహారం ప్రకటించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..