
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రెండు రోజుల క్రితం ORRపై పటాన్ చెరు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆ రోజు అందుబాటులో లేని కేటీఆర్.. ఇవాళ ఆమె ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమోషన్ అయ్యారు. లాస్య రోడ్డు ప్రమాదం లో చనిపోయిన విషయం తెలుసుకొని విస్మయానికి గురి అయ్యానని, ఆరోజు నేను విదేశాల్లో ఉండటం వల్ల రాలేక పోయానని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఆ అమ్మాయిని గత 10,15 రోజులుగా అనేక ప్రమాదాలు వెంటాడాయని, గత ఏడాది వారి నాన్న ఎమ్మెల్యే సాయన్న చనిపోయారని, ఇప్పుడు ఈమె చనిపోవటం బాధాకరమని కేటీఆర్ అన్నారు. లాస్య కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని, లాస్య నందితను కంటోన్మెంట్ ప్రజలు భారీ మెజారిటీతో ఎమ్మెల్యే గా గెలిపించారని కేటీఆర్ అన్నారు. కేటీఆర్ వెంట మాజీ హోమ్ మంత్రి, ఎమ్మెల్సీ మహమూద్ అలీ, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అలా వెంకటేశ్వర్ రెడ్డి, గువ్వల బాల్ రాజ్, స్థానిక బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. కేటీఆర్ రాక నేపథ్యంలో కంటోన్మెంట్ కు బీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు భారీగా చేరుకున్నారు.
కాగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత అనుమానాస్పద మృతి నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, ఇతర వీఐపీల డ్రైవర్లకు డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల వీఐపీలకు సంబంధించిన ప్రమాదాలు, కొన్ని ప్రమాదాలు ప్రాణాంతకంగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందడం తాజా ఘటన. విఐపి కార్లు నడిపే డ్రైవర్లందరికీ రవాణా శాఖ డ్రైవింగ్ పరీక్షలు నిర్వహిస్తుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. విఐపిలందరికీ సహకరించాలని కోరుతూ లేఖలు పంపుతామని ఆయన పేర్కొన్నారు.