“ఇక నిరీక్షణ ముగిసింది.. త్వరలో బిగ్ అప్‌డేట్..” కొండా సురేఖ సంచలన పోస్ట్!

మాజీ మంత్రి కొండా సురేఖ సోషల్ మీడియాలో చేసిన "బిగ్ అప్‌డేట్" పోస్ట్ తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. కాంగ్రెస్ పార్టీలో ఆమె భవిష్యత్తుపై ఇది తీవ్ర చర్చకు దారితీసింది. గతంలో రాజీనామా చేయనని ప్రకటించినప్పటికీ, కొండా మురళి వ్యాఖ్యలు, సురేఖ ప్రస్తుత పోస్ట్ ఆమె నిర్ణయంపై పునరాలోచన చేస్తున్నారనే సందేహాలను పెంచాయి. కొండా కుటుంబం కాంగ్రెస్‌లోనే కొనసాగుతుందా లేదా కొత్త నిర్ణయం తీసుకుంటుందా అనేది ఉత్కంఠగా మారింది.

“ఇక నిరీక్షణ ముగిసింది.. త్వరలో బిగ్ అప్‌డేట్..” కొండా సురేఖ సంచలన పోస్ట్!
Konda Surekha Post

Updated on: Sep 04, 2026 | 1:17 PM

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కొండా కుటుంబం పేరు హాట్‌టాపిక్‌గా మారింది. మాజీ మంత్రి, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కొండా సురేఖ సోషల్‌ మీడియాలో చేసిన తాజా పోస్ట్‌ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. “ఇక నిరీక్షణ ముగిసింది.. అతి త్వరలో నిర్ణయం ప్రకటిస్తా” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలతో తదుపరి అడుగు ఏంటి? అనే చర్చ మొదలైంది.

మంత్రి పదవి నుంచి తొలగించిన తర్వాత కొండా సురేఖ గతంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేయబోనని, ఎమ్మెల్యేగా కొనసాగుతూ తన నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు ఆమె చేసిన తాజా పోస్టుతో తన నిర్ణయంపై పునరాలోచన చేస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Konda Surekha Shock Post

ఇదే సమయంలో కొండా సురేఖ భర్త కొండా మురళి ఇటీవల చేసిన వ్యాఖ్యలు, ప్రదర్శించిన దూకుడు కూడా రాజకీయ చర్చకు కారణమయ్యాయి. దీంతో కొండా కుటుంబం కాంగ్రెస్‌లోనే కొనసాగుతుందా? లేక మరో రాజకీయ నిర్ణయం తీసుకుంటుందా? అనే ఉత్కంఠ నెలకొంది.

కొండా సురేఖ రాజకీయ ప్రస్థానంలో గతంలోనూ పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణం తర్వాత వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలనే డిమాండ్‌కు మద్దతుగా ఆమె అప్పటి పరిణామాల్లో కీలకంగా వ్యవహరించారు.

అయితే ప్రస్తుతం కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పడం, మరో పార్టీలో చేరడం వంటి అంశాలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాబట్టి ఆమె “బిగ్ అప్‌డేట్” ఏంటన్నది వెల్లడయ్యే వరకు ఊహాగానాలు మాత్రమే కొనసాగనున్నాయి.

కొండా సురేఖ నెక్ట్స్ స్టెప్ ఏంటి?

కొండా సురేఖ రాజకీయ భవిష్యత్‌పై చర్చ జోరందుకుంది. మంత్రివర్గం నుంచి ఆమెను తప్పించిన తర్వాత కొండా కుటుంబం తదుపరి అడుగు ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా? లేక పార్టీలోనే కొనసాగుతారా? అనే దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. అయితే, కొండా దంపతులకు బీఆర్ఎస్ నాయకత్వంతో సయోధ్య కుదిరే అవకాశం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2018 ఎన్నికల సమయంలో కేసీఆర్, కేటీఆర్‌పై కొండా దంపతులు చేసిన తీవ్ర విమర్శలు కూడా ఈ చర్చకు కారణంగా మారాయి.

మరోవైపు భారతీయ జనతా పార్టీ వైపు కొండా కుటుంబం అడుగులు వేస్తుందనే ప్రచారం ఉన్నప్పటికీ.. ఇప్పటివరకు ఆ పార్టీ నుంచి అధికారికంగా ఎలాంటి ఆహ్వానం అందలేదని సమాచారం. అంతేకాదు, కొండా దంపతులను పార్టీలోకి చేర్చుకునే విషయంలో బీజేపీలోనూ భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో కొండా సురేఖ, కొండా మురళి తమ అనుచరులతో వరుసగా సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర పార్టీల నుంచి వచ్చే ప్రతిపాదనలపై కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం.

‘ప్లాన్ బీ’ అదేనా?

మరో ఆసక్తికర పరిణామం కొండా మురళి మీసం తిప్పడం.. మంత్రివర్గం నుంచి సురేఖను తప్పించిన తర్వాత ఆయన వ్యవహరించిన తీరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే కాంగ్రెస్‌కు రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవిని వదులుకుని ఉప ఎన్నికలకు వెళ్లడమే కొండా కుటుంబం ‘ప్లాన్ బీ’నా? అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. దీనిపై కొండా కుటుంబం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Loading...
Unable to load recommendations.
Follow Us