Balapur Laddu History: ఏటా సరికొత్త రికార్డులు.. బాలాపూర్ లడ్డూ చరిత్ర ఏంటో మీకు తెలుసా..?
బాలాపూర్ గణేష్ చివరి పూజా కార్యక్రమం ప్రారంభమైంది. ఉదయం గ్రామ ప్రదక్షిణ అనంతరం 9:30 గంటలకు ప్రసిద్ధ బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ప్రారంభం కానుంది. 1994లో రూ.450తో మొదలైన వేలం 2025లో రూ.35 లక్షలకు చేరింది. ఈసారి లడ్డూ ఎంత ధర పలుకుతుందనే ఆసక్తి నెలకొంది.

బాలాపూర్ గణేష్ చివరి పూజా కార్యక్రమం ప్రారంభమైంది.. ఆ తర్వాత.. క్రేన్ సహాయంతో బాలాపూర్ గణేషుడ్ని మినీ ట్రక్కుపైకి ఎక్కించి… ఉదయం 7గంటలకు గ్రామ ప్రదక్షిణ నిర్వహిస్తారు. ఉదయం 9:00 గంటలకు ప్రదక్షిణ పూర్తి చేసుకుని.. బాలాపూర్ గ్రామ బొడ్రాయి దగ్గరకు గణేష్ చేరుకుంటారు. ఉదయం 9:30 గంటలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాట కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఖైరతాబాద్ గణేశుడి తర్వాత భాగ్యనగరంలో అందరి దృష్టినీ ఆకర్షించేది బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం పాట. ఇక్కడి లంబోదరుడి చేతిలో ఉండే లడ్డూ వేలం పాటతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంటోంది. లడ్డూను ఎవరు దక్కించుకుంటే వారింట సిరిసంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అందుకే గణేశుడి లడ్డూ వేలం పాట కోసం సర్వత్రా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.
32 ఏళ్లుగా ఇక్కడ లడ్డూ వేలం పాట కొనసాగుతుంది. ఇది 33వ సంవత్సరం. చాలా ప్రాంతాల్లో లడ్డూ వేలం పాటలు ఉన్నప్పటికీ ఇక్కడి వేలం పాట తరతరాలుగా కొనసాగుతోంది. ఏటా లడ్డూ ధర పెరగడమే తప్ప తగ్గడం లేదు. అదే ఇక్కడి ప్రత్యేకత. అందుకే భక్తులంతా బాలాపూర్ లడ్డూ వేలం పాట కోసం ఎదురు చూస్తుంటారు. 1994లో రూ.450తో మొదలైన లడ్డూ వేలం రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వందలు, వేలు దాటి లక్షలు పలుకుతోంది. 20 మంది స్థానికులు, స్థానికేతరుల మధ్య జరిగే ఈ వేలం పాటలో నువ్వా-నేనా అన్నట్లు పోటీపడతారు భక్తులు.. అంతేకాకుండా.. లడ్డూ వేలంలో వచ్చిన డబ్బులను సమాజ సేవకే ఉపయోగిస్తారు.
వేల రూపాయల నుంచి.. లక్షల వరకు..
2001 వరకు బాలాపూర్ లడ్డూ వేలల్లోనే పలికింది. 2002లో కందాడ మాధవరెడ్డి పోటీ పడి రూ.లక్షా 5వేలకు లడ్డూ దక్కించుకున్నారు. ఆ తర్వాత ఏడాది నుంచి.. ఏటా రూ.లక్ష చొప్పున పెరుగుతూ వచ్చింది. 2007లో స్థానికుడు రఘునందన చారి 4లక్షల 15వేలకు లడ్డూను దక్కించుకున్నారు. అప్పటి వరకు ఒక్కో రూ.లక్ష పెరుగుతూ వచ్చిన లడ్డూ ధర ఏకంగా రూ.2 లక్షలు దాటింది. 2015లో బాలాపూర్ లడ్డూ రూ.10 లక్షలు దాటి రికార్డు సృష్టించింది. కల్లెం మదన్ మోహన్ రెడ్డి రూ.10లక్షల 32వేలకు లడ్డూను దక్కించుకున్నారు. 2016లో రూ.4 లక్షలు పెరిగింది. ఆ ఏడాది మేడ్చల్‌కు చెందిన స్కైలాబ్ రెడ్డి రూ.14లక్షల 65వేలకు లడ్డూను కైవసం చేసుకున్నారు. 2017లో నాగం తిరుపతి రెడ్డి రూ.15లక్షల 60వేలకు లడ్డూ పొందగా, 2018లోనూ స్థానికేతరుడు తేరేటి శ్రీనివాస్ గుప్తా రూ.16లక్షల 60వేలకు బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు. వరుసగా మూడేళ్లు స్థానికేతరులనే బాలాపూర్ గణేశుడు కరుణించాడు.
ఇక 2019లో జరిగిన వేలం పాటలో స్థానికులకు అవకాశం దక్కింది. కొలను రాంరెడ్డి రూ.17లక్షల 60వేలకు బాలాపూర్ లడ్డూను కైవసం చేసుకున్నారు. 2020లో కరోనా కారణంగా లడ్డూ వేలం పాటను రద్దు చేసిన ఉత్సవ సమితి, ఆ లడ్డూను అప్పటి సీఎం కేసీఆర్‌కు ఇచ్చారు. 2021లో ఏపీ ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ నాదర్గుల్కు చెందిన మర్రి శశాంక్ రెడ్డితో కలిసి రూ.18లక్షల 90వేలకు బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు. ఏటా రూ.రెండు నుంచి రూ.మూడు లక్షలు పెరుగుతుందనుకుంటే.. 2022లో బాలాపూర్ లడ్డూ ధర ఏకంగా రూ.5 లక్షలు పెరిగి రికార్డు సృష్టించింది. 2022లో రూ.24లక్షల 60వేలు పలికి భక్తులంతా మరోసారి బాలాపూర్ వైపు చూసేలా చేసింది. వంకేటి లక్ష్మా రెడ్డి 2022లో లడ్డూ దక్కించుకున్నారు.
2023లో జరిగిన వేలం పాటలో తీవ్ర పోటీ నెలకొనగా, రూ.27 లక్షలకు స్థానికేతరుడైన దయానందరెడ్డి బాలాపూర్ లడ్డూను సొంతం చేసుకున్నారు. 2024లో రూ.30 లక్షల ఒక వెయ్యికి స్థానికుడైన కొలను శంకర్ రెడ్డి బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు. 2025లో కర్మన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ పోటా పోటీగా రూ.5 లక్షలు అదనంగా పాడి రూ.35 లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. ఈసారి మరో రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు పెరగవచ్చని ఉత్సవ సమితి భావిస్తోంది.
