
వరంగల్ రాజకీయాల్లో అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్‌ను ప్రభుత్వం తొలగించడం రాజకీయ చర్చలకు, రచ్చకు దారితీసింది. ఓఎస్డీ సుమంత్ పై చర్యలు కొండా వర్గం అవమానకరంగా భావించగా, ప్రభుత్వం మాత్రం పరిపాలనా నిర్ణయంగా సమర్ధించుకుంది. ఇందులో ఎవర్నీ టార్గెట్ చేసే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేసింది.
ప్రస్తుతం పార్టీకి, తమకు ఉన్న గ్యాప్‌ను తగ్గించుకునే పనిలో కొండా ఫ్యామిలీ బిజీగా ఉంది. ఇందులో భాగంగా దీపావళి రోజున సీఎం రేవంత్‌రెడ్డితో కొండా ఫ్యామిలీ భేటీ అయి జరిగిన ఇష్యూస్‌పై చర్చించారు. వివాదంపై సీఎం రేవంత్‌కు కొండా దంపతులు వివరణ ఇచ్చారు.
అయితే ఈ సమయంలో బీఆర్ఎస్ నేత రాజయ్య కొండా సురేఖకు మద్దతుగా మాట్లాడటం, వరంగల్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. రాజయ్య ఎంట్రీతో వరంగల్ రాజకీయాల్లో మిత్రులు శత్రువులుగా, శత్రువులు మిత్రులుగా మారే పరిణామం జరుగుతోందా అన్న చర్చ మొదలైంది.
మేడారం టెండర్ వార్‌తో స్టార్టయిన కొండా వివాదం …ఓఎస్డీ తొలగింపుతో అగ్నిగుండంగా మారింది. ఓఎస్డీని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు మంత్రి కొండా సురేఖ ఇంటికి వెళ్లడం, కొండా సురేఖ కూతురు సుష్మిత ఏకంగా సీఎం రేవంత్‌రెడ్డినే టార్గెట్ చేయడం మరింత ఆజ్యం పోసినట్లైంది. చివరకు మంత్రి కొండా సురేఖ..క్యాబినెట్ సమావేశానికి కూడా డుమ్మా కొట్టడంతో హీట్ మరింత పెరిగింది. క్యాబినెట్ మీటింగ్ కూడా పక్కన పెట్టి , తన కూతురు సుస్మితతో కలిసి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలను కలిసి కొండా సురేఖ తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఓఎస్డీ సుమంత్ విషయంలో ప్రభుత్వం తీరుతో పాటు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీ నేతలంతా తనను దూరం పెట్టారంటూ మంత్రి సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈవివాదాల నేపధ్యంలో సీఎం రేవంత్‌రెడ్డితో కొండా దంపతులు భేటీకావడం ప్రాధాన్యత సంతరించుకుంది. జరిగిన వివాదాలపై కొండా సురేఖ రేవంత్‌రెడ్డికి వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి కొండా వివాదం రాబోయే రోజుల్లో పార్టీ భవిష్యత్‌పై ప్రభావం చూపే అవకాశముందంటున్నారు విశ్లేషకులు. వరంగల్ రాజకీయాలు ఎప్పుడూ రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపిన చరిత్ర ఉంది. ఈసారి కూడా అలాగే జరుగుతుందా అన్న డిస్కషన్ కూడా జరుగుతోంది.
పార్టీ పెద్దల జోక్యంతో ఇష్యూ ఇంతటితో సద్దుమణుగుతుందా? మున్ముందు కొత్త పరిణామాలకు దారి తీస్తుందా అన్నది చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.