
మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్ నాయకత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ కొనసాగుతుండగానే.. ఈ అంశంలో మరికొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కొండా మురళి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమావేశం కావడం హాట్ టాపిక్‌గా మారింది. కొండా సురేఖ, చిన్నారెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతల తీరుపై టీపీసీసీకి క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇచ్చిన క్రమంలో.. కొండా మురళి, రాజగోపాల్ రెడ్డి భట్టి విక్రమార్కను కలవడం చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశంలో పలు విషయాలను మాట్లాడినట్లు తెలుస్తోంది. అధిష్టానం నిర్ణయం ఎలా ఉండబోతోంది.. అలాగే.. ఎలాంటి పరిణామాలుంటాయి..? అనే విషయాలను భట్టితో కొండా మురళి.. మాట్లాడినట్లు సమాచారం..
అయితే.. భట్టి విక్రమార్కతో భేటీ అనంతరం కొండా మురళి కీలక వ్యాఖ్యలు చేశారు. సుస్మిత వ్యాఖ్యలపై భట్టితో చర్చించలేదని స్పష్టంచేశారు. సుస్మిత ఆమెకు నచ్చినట్టుగానే ఉంటుందన్నారు. తన కూతురికి స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉందన్నారు. ఓ బిల్లుపై చర్చించేందుకు భట్టి దగ్గరికి వచ్చానని.. భట్టితో క్రమశిక్షణ కమిటీ రిపోర్టుపై చర్చించలేదని కొండా మురళి కామెంట్ చేశారు. సురేఖ అందుబాటులో లేదనడం అవాస్తవమని, వరంగల్‌లో పర్యటిస్తున్నారని పేర్కొన్నారు. సుస్మితకు 38ఏళ్లు, ఆమెకు 15ఏళ్ల వరల్డ్ చాంపియన్ కొడుకున్నాడని.. సుస్మిత తనకు తగ్గట్టుగా తాను ఉంటుందన్నారు. గాంధీ కుటుంబంపై పూర్తి విశ్వాసముందని, కాంగ్రెస్ లోనే కొనసాగుతానని కొండామురళి తెలిపారు.
‘‘సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం.. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి.. సుస్మితను ప్రశ్నించే హక్కు మాకు లేదు.. కమిటీకి మేం చెప్పాల్సింది చెప్పాం.. నేను కాంగ్రెస్‌లోనే కొనసాగుతా.. ఓ బిల్లు విషయంలో భట్టిని కలిశా.. గాంధీ కుటుంబంపై మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది.. బీఆర్‌ఎస్ నుంచి కవిత బయటకు రాలేదా.. ఎవరూ మాట్లాడట్లేదు… దీనిపై గోల ఎందుకు?.. నా బిడ్డకు స్వతంత్రంగా మాట్లాడే హక్కుంది’’.. అంటూ కొండా మురళి పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..