Komatireddy Rajagopal Reddy: పైసలూ మీకే.. పదవులూ మీకేనా? సీఎం రేవంత్‌పై కోమటిరెడ్డి ఫైర్

మంత్రి పదవి దక్కకపోవడంతో గత కొన్ని రోజులుగా సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తాజాగా పైసలు మీకే.. పదవులు మీకేనా..? అంటూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Komatireddy Rajagopal Reddy: పైసలూ మీకే.. పదవులూ మీకేనా? సీఎం రేవంత్‌పై కోమటిరెడ్డి ఫైర్
Komatireddy Raj Gopal Reddy Criticizes CM Revanth

Updated on: Aug 16, 2025 | 9:28 AM

తెలంగాణ కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశం హాట్ టాపిక్‌గా మారింది. మంత్రివర్గ విస్తరణలో ఆయనకు నిరాశ ఎదురవడంతో అప్పటి నుంచి సీఎం రేవంత్‌పై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. నిత్యం విమర్శలు చేస్తూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. అటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం అధిష్ఠానం కోమటిరెడ్డికి మంత్రి పదవి ఇస్తామన్నది నిజమేనని చెప్పడం గమనార్హం. అయితే అధిష్ఠానం ఇచ్చిన హామీతో పాటు తన పనితనాన్ని చూసి మంత్రి పదవి ఇవ్వాలని కోమటిరెడ్డి చెబుతున్నారు. అన్నదమ్ముళ్లకు ఇద్దరికీ మంత్రి పదవి ఇస్తే ఏమవుతుందని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో మరోసారి కోమటిరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. పైసలు, నిధులు అన్నీ మీకేనా అంటూ రేవంత్ రెడ్డిని నిలదీశారు.

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లగిరిలో జరిగిన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహావిష్కరణ సభలో కోమటిరెడ్డి పాల్గొన్నారు. గత 20 నెలలుగా మునుగోడు నియోజకవర్గంలో రోడ్లు, భవనాల నిర్మాణాల కోసం ఒక్క రూపాయి కూడా నిధులు రాలేదని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. మంత్రిని వందసార్లు కలిసినా ఫలితం లేకపోయిందని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించక తప్పదన్నారు. ‘‘పదవులు మీరే తీసుకుంటున్నారు.. నిధులు కూడా మీరే తీసుకుంటున్నారని అడగాలా వద్దా?’’ అని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. తాను ముఖ్యమంత్రిని కానీ, పార్టీని కానీ విమర్శించడం లేదని, మునుగోడు నియోజకవర్గానికి నిధులు రావడం లేదనే ఆవేదనతోనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలోనే ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ‘‘వలిగొండ-చౌటుప్పల్ రోడ్డు నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఎందుకంటే కాంట్రాక్టర్లకు బిల్లులు రావడం లేదు. ఆ బిల్లులు ముఖ్యమంత్రి ఆదేశిస్తేనే వస్తాయి. అందుకే నేను ముఖ్యమంత్రిని ఉద్దేశించి పదవులు మీకే.. పైసలూ మీకేనా? అని అడిగాను’’ అని రాజగోపాల్ రెడ్డి వివరించారు.

మంత్రి పదవితోనే మునుగోడుకు న్యాయం

మంత్రి పదవి ఇవ్వడమనేది అధిష్ఠానం నిర్ణయమని రాజగోపాల్ రెడ్డి అన్నారు. పదవి రావలసి ఉంటే ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించారు. ఒకవేళ తనకు మంత్రి పదవి వస్తే మునుగోడు ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి నాయకులను ఎన్నుకోవాలని, ఎందుకంటే నియోజకవర్గ అభివృద్ధికి నిధుల కోసం వారితో కలిసి తాను పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు.