Khammam: “నీలాంటి తండ్రి ఏ కూతురికీ ఉండడు.. వాడ్ని మాత్రం అస్సలు వదలొద్దు నాన్న”
ఖమ్మం జిల్లాలో జరిగిన ప్రేమకథ చివరికి విషాదంగా ముగిసింది. చిన్ననాటి పరిచయంతో మొదలైన అనుబంధం.. అనేక కుదుపులు ఎదుర్కొంది. అయినా ఆ బంధం ముగియలేదు. చివరికి విశాఖపట్నంలో ఇద్దరూ కలసి జీవనం ప్రారంభించినా, అకస్మాత్తుగా యువకుడు కనిపించకుండా పోవడంతో ఆ యువతి తీవ్ర నిర్ణయం తీసుకుంది. అద్దె గదిలో ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామం మొత్తం ఒక్కసారిగా కలకలం రేగింది.

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం ఎర్రగడ్డ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యువతి కోళ్లపూడి రమ్య విశాఖలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివాహితుడు నరేష్ ప్రేమ పేరుతో విశాఖ తీసుకెళ్లి దూరం పెట్టడంతో.. మోసపోయానన్న బాధతో ఆత్మహత్య చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని ఎర్రగడ్డకు చెందిన మేడే నరేష్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన రమ్య కొన్నేళ్ల క్రితం ప్రేమించుకున్నారు. అప్పుడు ఇద్దరూ తమ ఇళ్ల నుంచి వెళ్లిపోయ్యారు.రమ్యకు మైనారిటీ తీరకపోవడంతో వారిద్దరినీ రెండు కుటుంబాల పెద్దలు సర్దిచెప్పి తీసుకొచ్చారు. ఆ తరువాత నరేశ్‌కు తల్లిదండ్రులు నచ్చజెప్పి మరో యువతితో పెళ్లి చేశారు. ఆ తర్వాత రమ్య చదువు మానేసి, హైదరాబాద్‌లోని ఓ మెడికల్ షాపులో పనిచేంది. నరేశ్ కూడా తన భార్యతో హైదరాబాద్లో ఉంటూ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇటీవల రాఖీ పండుగకు రమ్య తన ఇంటికి రాగా నరేష్ కూడా వచ్చాడు. అనంతరం తమ కుటుంబ సభ్యులకు తెలియకుండా విశాఖపట్నం వెళ్లారు. అక్కడ రమ్యకు నరేశ్ తాళి కట్టాడు. అక్కడే ఓగది అద్దెకు తీసుకుని నివాసం ఉన్నారు. రాఖీ పండుగ రోజు నుంచి తమ కుమారుడు నరేష్ కనిపించడం లేదంటూ నరేశ్ తండ్రి బొందయ్య, తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ విషయం తెలుసుకున్న నరేష్.. రమ్యను విశాఖపట్నంలోనే వదిలేసి, రెండు రోజుల కిందట సొంతూరు ఎర్రగడ్డ వచ్చాడు. వైజాగ్‌లో ఉన్న రమ్య నరేష్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వచ్చింది.దీంతో తాను మోసపోయానని గ్రహించిన ఆమె, తన తల్లిదండ్రులకు సూసైడ్ నోట్ రాసి.. అద్దె గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రమ్య తండ్రి అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .ఇద్దరిదీ ఒకే గ్రామం కావడం తో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
