IG Lakshman naik Audio: ఆయనో టాప్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌.. నోరుతెరిస్తే బండబూతులు.. ఫోన్‌ చేసి నేతలపై తిట్లదండకం!

|

May 21, 2021 | 6:26 PM

కేరళలో పనిచేస్తున్న తెలుగు ఐపీఎస్‌ అధికారి జి.లక్ష్మణ్‌ నాయక్‌ పెద్ద వివాదంలో ఇరుక్కున్నారు. టీఆర్‌ఎస్‌ నేతలతో పాటు గిరిజన రిజర్వేషన్‌ సమితి నేతలపై అనుచిత వ్యాఖ్యలు.

IG Lakshman naik Audio: ఆయనో టాప్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌.. నోరుతెరిస్తే బండబూతులు.. ఫోన్‌ చేసి నేతలపై తిట్లదండకం!
Kerala Ig G Lakshman Naik Controversy Comments
Follow us on

IG Lakshman Naik Controversy Comments: కేరళలో పనిచేస్తున్న తెలుగు ఐపీఎస్‌ అధికారి జి.లక్ష్మణ్‌ నాయక్‌ పెద్ద వివాదంలో ఇరుక్కున్నారు. వరంగల్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ నేతలతో పాటు గిరిజన రిజర్వేషన్‌ సమితి నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడిపోయారు. ఆయన తిట్ల దండకంతో ఎవరిని వదలడంలేదు. మంత్రి దగ్గర నుంచి మామూలు వ్యక్తి వరకు నోటిచ్చినట్లు వాగేశాడు. అంతేకాదు ఎన్‌కౌంటర్‌ చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించి ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్‌, మహబూబాబాద్‌ ప్రస్తుత ఎంపీ కవిత, మాజీ ఎంపీ సీతారాంనాయక్‌పై కూడా అభ్యంతర వ్యాఖ్యలు చేశారు లక్ష్మణ్‌ నాయక్‌. ఆయన ఫోన్‌ ఆడియోలు లీక్‌ కావడంతో పెనుదుమారం చెలరేగుతోంది. లక్ష్మణ్‌ నాయక్ వ్యాఖ్యలను పేస్‌బుక్‌లో తప్పుపట్టారు గిరిజన రిజర్వేషన్‌ సాధన సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ విజయ్‌ మాలోత్‌ నాయక్‌. ఇది చూసి విజయ్‌ మాలోతును ఎన్‌కౌంటర్‌ పేరుతో చంపుతానని బెదిరించారు ఐజీ లక్ష్మణ్‌ నాయక్‌. ఇప్పుడి ఆడియో రాష్ట్రంలో పెద్ద దుమారమే రేగుతోంది.

లక్ష్మణ్‌ నాయక్‌ ప్రస్తుతం కేరళ ట్రాఫిక్‌ వింగ్‌ అండ్‌ సోషల్‌ పోలీసింగ్‌ విభాగంలో ఐజిగా పనిచేస్తున్నారు. గతంలో కూడా ఐజీ లక్ష్మణ్‌ నాయక్‌ చాలా వివాదాల్లో ఇరుక్కున్నారు. గత ఫిబ్రవరిలో తెలంగాణ కేబినెట్‌లో చేరబోతున్నట్లు, కేటీఆర్‌ నిర్వహిస్తున్న ఐటీ శాఖను తనకు కేటాయిస్తున్నట్లు ప్రచారం చేసుకున్నారు. అంతేకాదు మంత్రివర్గంలో లక్ష్మణ్‌ నాయక్‌ను తీసుకుంటున్నట్లు సీఎం కేసీఆర్‌.. కేరళ సీఎం పినరాయి విజయన్‌కు సమాచారం అందంచారని కూడా ఫ్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియాలో ప్రచారం చేసుకున్నారు. ఇంకా 14 ఏళ్ల పాటు సర్వీసు ఉండగానే తాను రాజీనామా చేస్తున్నట్లు కూడా చెప్పుకొచ్చారు లక్ష్మణ్. ఇప్పటికే లక్ష్మణ్ బంధువులు చాలామంది తెలంగాణ రాజకీయాల్లో ఉన్నారు.

లక్ష్మణ్ నాయక్ ఖమ్మం జిల్లా వాసి. అలపుజా ఏఎస్పీగా తన కెరీర్‌ను ప్రారంభించారు. తిరువనంతపురం గ్రామీణ ప్రాంతం, క్రైమ్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ విభాగాల్లో సేవలందించారు. అంతేకాదు బీఎస్‌ఈ, ఎస్‌ఎమ్‌ఈ సీఈఓగా నాలుగేళ్ల పాటు సేవలందించారు. ఇక లక్ష్మణ్ ఉమ్మడి ఏపీ డీజీపీగా పనిచేసిన డీటీ నాయక్ కుమార్తె డాక్టర్ కవితను వివాహం చేసుకున్నారు.

కాగా, తాజాగా మంత్రి, ఎంపీతో సహా నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని స్థానిక నాయకులు సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఆయనపై ఏకంగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇదే క్రమంలో ఐజీ లక్ష్మణ్‌ నాయక్‌తో తనకు ప్రాణ భయం ఉందని, రక్షణ కల్పించాలని కోరుతున్నారు గిరిజన రిజర్వేషన్‌ సాధన సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ విజయ్‌ మాలోత్‌. పేస్‌ బుక్‌లో ఐజీ లక్ష్మన్‌ నాయక్‌ వ్యాఖ్యలను తప్పుపట్టినందుకు తనను టార్గెట్‌ చేశారని, ఎన్‌కౌంటర్‌ చేసి చంపుతానని బెదిరించాడని ఆరోపించారు విజయ్‌.