
కర్నాటకలో కరెంట్ ఎపిసోడ్..తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి షాక్ కొడుతున్న పరిస్థితి నెలకొంది. ఇటీవల వరుసగా కర్నాటక రైతులు తెలంగాణ సరిహ్దద్దుజిల్లాలో ఆందోళనకు దిగారు. మొన్న గద్వాల, కొడంగల్, నిన్న పరిగి, నారాయణఖేడ్‌లో కర్నాటక రైతులు పెద్దయెత్తున తరలివచ్చి కాంగ్రెస్ ఇస్తున్న హామీలను నమ్మి మోసపోవద్దని ప్రజలను కలిసి విన్నవిస్తున్నారు. కొన్నిచోట్ల ఏకంగా కర్నాటక రైతులు ఆందోళనకు దిగారు. తమ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం.. కేవలం 3 నుంచి 4 గంటలు మాత్రమే కరెంటు ఇస్తొందని.. దాంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్యారంటీలతో తెలంగాణ ప్రజలు మోసపోవద్దని నినాదాలు చేశారు.
కర్నాటకలో కరెంట్ కటకట ఇష్యూనే.. తెలంగాణలో ఎన్నికల ప్రచారాస్త్రంగా ఉపయోగించుకోవాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీని ఇరుకున్నపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో..బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య కరెంట్ పోరు హీట్ పుట్టిస్తోంది. ఐదు గంటల కరెంట్ కావాలా.. 24 గంటల కరెంట్ కావాలా అని బీఆర్ఎస్ ప్రజల్లో ప్రచారం చేస్తోంది. అదేసమయంలో..మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కర్నాటకలో కరెంట్ కోతలపై మంత్రి కేటీఆర్ మరోసారి రియాక్ట్ అయ్యారు. తెలంగాణలో కర్నాటక రైతుల ప్రచారాన్ని స్పాన్షర్డ్ అంటున్నారని.. కావాలంటే అక్కడకు వెళ్లి చూస్తే నిజాలు తెలుస్తాయన్నారు మంత్రి కేటీఆర్.
కర్నాటకలో కరెంట్‌పై బీఆర్‌ఎస్ చేస్తున్న దుష్ఫ్రచారాన్ని తిప్పికొట్టాలని టీ కాంగ్రెస్ భావించింది. అందులో భాగంగా కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సహా, మల్లిఖార్జున ఖర్గేను రంగంలోకి దించింది. వారితోనే చెప్పించేందుకు ప్లాన్ చేసింది. శనివారం వికారాబాద్‌జిల్లా తాండూరులో ప్రారంభమైన రెండో విడత విజయభేరి బస్సుయాత్రలో డీకే శివకుమార్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కర్నాటకలో రైతులకు 5 గంటల కరెంట్ అందిస్తున్నామని స్పష్టం చేశారు. అనుమానం ఉంటే కేసీఆర్, కేటీఆర్ కర్ణాటకకు వచ్చి చూసుకోవాలన్నారు శివకుమార్.
కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ 5 గంటలు కరెంట్ ఇస్తున్నామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు సీఎం కేసీఆర్. కర్నాటకలో తాము ఇచ్చిన 5 గ్యారంటీ పథకాల్లో నాలుగు ప్రస్తుతం అమలవుతున్నాయన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే. సంగారెడ్డిలో జరిగిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాము చెప్పేవి అబద్ధాలైతే ఓ స్పెషల్ బస్సును ఏర్పాటు చేస్తాం..అక్కడికి వెళ్లి చూడాలని బీఆర్‌ఎస్ నేతలకు కౌంటర్ ఇచ్చారు ఖర్గే.
కర్ణాటకకు వస్తే తాము చేసిన అభివృద్ధి చూపిస్తామన్న ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. మీ వైఫల్యాలను చూడటానికి కర్ణాటక వరకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. మీ చేతిలో దగా పడ్డ అక్కడి రైతులే ఇక్కడికి వచ్చి మీరు చేసిన అన్యాయాన్ని వివరిస్తున్నారని, తెలంగాణ రైతులకు కాంగ్రెస్ నుంచి పొంచి ఉన్న ప్రమాదంపై హెచ్చరిస్తున్నారని సామాజిక మాధ్యమం ఎక్స్ పోస్ట్ చేశారు. కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే అంధకారమే అని కర్ణాటక దుస్థితిని చూసి తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయిందన్నారు మంత్రి కేటీఆర్. దేశంలోనే ఎక్కడ లేని విధంగా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న తెలంగాణకు వచ్చి..కర్ణాటకలో 5 గంటలు కరెంట్ ఇస్తున్నామని గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. అది మీ చేతకానితనానికి నిదర్శనమన్నారు.
కర్నాటక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఐదు హామీలు అని అరచేతిలో వైకుంఠం చూపించారని విమర్శించారు. తీరా గద్దెనెక్కిన తరువాత సవాలక్ష కొర్రీలతో ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. మీ గృహజ్యోతి పథకం గాలిలో దీపంలా ఆరిపోయిందన్నారు. కనీసం ఐదుగంటలు కూడా కరెంట్ లేక అక్కడి రైతాంగమే కాదు.. రాష్ట్ర రాజధాని బెంగుళూరులో ఎడాపెడా పవర్ కట్‌లతో వాణిజ్య వ్యాపార సంస్థలు కూడా కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు కేటీఆర్. కర్నాటకలో అన్నభాగ్య స్కీమ్ పూర్తిగా అటకెక్కిందన్నారు కేటీఆర్. కనీసం రేషన్ బియ్యం కూడా ఇవ్వలేక చేతులెత్తేసిన కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలకు అక్కడి ప్రజలు అన్నమో రామచంద్ర అని అల్లాడిపోతున్నారు. రేషన్‌పై కూడా సన్నబియ్యం ఇవ్వాలన్న మా సంకల్పానికి.. కనీసం రేషన్ బియ్యం కూడా ఇవ్వలేని మీ అసమర్థ పాలనకు ఉన్న తేడాను తెలంగాణ సమాజం స్పష్టంగా అర్థం చేసుకుందన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం అని మభ్యపెట్టి మొత్తానికే కర్ణాటక ఆర్టీసిని దివాళా తీసిన విధానం ప్రజలకే కాదు.. అక్కడి ఉద్యోగులకు కూడా పెను ప్రమాదంగా మారిందని కేటీఆర్ విమర్శించారు.
కర్నాటక డిప్యూటీ సీఎం తెలంగాణ పర్యటనకొచ్చిద..ఆ పార్టీని బొందపెట్టి వెళ్లిపోయాడని విమర్శించారు మంత్రి హరీష్‌రావు. కేవలం 5 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తున్నట్లు ఆయనే ఒప్పుకున్నారన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ కావాలా? లేక 24 గంటలు కరెంట్ ఇచ్చే బీఆర్‌ఎస్ ప్రభుత్వం కావాలా? అని ప్రశ్నించారు హరీష్‌రావు. మరోవైపు.. తెలంగాణలో ఎక్కడా రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వడంలేదన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. కేవలం 8, 9 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తున్నారని చెప్పారు.
మొత్తంగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. పవర్ ఫుల్ యుద్ధానికి తెరలేచింది. కరెంట్‌పై మాటల మంటలు రాజుకుంటున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే.. రాబోయే రోజుల్లో కరెంట్ ఫైట్ ఇంకే లెవల్‌కు చేరుకుంటుందో చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి