శంఖంలో పోస్తే తీర్థం అవుతుందంటారు..! కానీ కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు మాత్రం శంఖంలో పోసినా ఆ తీర్థం కలుషితమనిపిస్తే మాత్రం వదిలిపెట్టేదీ లేదంటూ చేతల్లోనే చూపిస్తున్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి బాధ్యతలు తీసుకున్న తరువాత సివిల్ మ్యాటర్ ముసుగేసి మరీ నేరాలకు పాల్పడిన వారి భరతం పడుతున్న సంగతి తెలిసిందే..! ఈ నేపథ్యంలో బాధితులు ఇస్తున్న ఫిర్యాదులను పరిశీలిస్తున్న ఎకానామిక్స్ అఫెన్సెస్ వింగ్ లోతుగా అధ్యయనం చేసి, డాక్యుమెంట్ ఎవిడెన్స్ సేకరించిన తరువాతే చట్టపరమైన చర్యలకు శ్రీకారం చుడుతోంది.
కరీంనగర్ జిల్లా నేతలకు కొత్త చిక్కులు వెంటాడుతున్నాయి. పోలీసుల నుండి తప్పించుకోవాలంటే అధికార పార్టీలో చేరితే సేఫ్ అవుతామని భావించినప్పటికీ లాభం మాత్రం ఉండడం లేదు. నేరం చేశారని డాక్యూమెంట్ల ద్వారా తేలితే చాలు క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి వెనకాడేది లేదని కుండబద్దలు కొడుతున్నారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని వివిధ స్టేషన్లలో మూడు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో నిందితులను అరెస్ట్ చేయగా కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.
ఏకంగా రికార్డులే మార్చేశారు..!
కరీంనగర్ సమీపంలోని చింతకుంటలో పామ్ రాజ్ దేవరాజ్ కు 106 ఎకరాల 8 గంటల వ్యవసాయ భూమి ఉండేది. ఈ భూమిని విక్రయించుకోగా 20 గుంటల స్థలం మిగిలి ఉంది. అయితే ఈ భూమికి సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో పట్టాదారు పేరు మారిపోయి న్యాలమడుగు చిన వీరయ్య పేరు చేరింది. అయితే చింతకుంట సర్పంచ్ గా వ్యవహరించిన పిట్టల రవిందర్ వీరయ్య అనే పేరుగల మరో వ్యక్తి కొడుకు రాజయ్య పేరిట తప్పుడు విరాసత్ చేయించారు. ఇందుకు అప్పుడు ఎమ్మార్వోగా ఉన్న మోహన్ రెడ్డి కూడా పిట్టల రవిందర్ కు సహకరించారు. రెవెన్యూ రికార్డుల్లోకి రాజయ్య పేరిట భూమి బదలాయింపు ప్రక్రియ పూర్తికాగానే 2009లో ఆదిరెడ్డి పేరిట మార్చి 2010లో పిట్టల రవిందర్ తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. బాధితుడు దేవిదాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడు పిట్టల రవిందర్ ను కోర్టులో హాజరు పర్చగా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.
ఒకే భూమిని పలువురికి విక్రయించి..
తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మొగిలిపాలెం గ్రామంలోని ఓ భూమిని పలువురికి విక్రయించిన కేసులో కార్పోరేటర్ భర్త ఆకుల ప్రకాష్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. తొమ్ముడ్రు నర్సింహారావు వద్ద 1998 లో ప్లాటును కొనుగోలు చేశాడు. నర్సింహారావు 1998 లో సర్వే నంబర్ 159/F లో 10 గుంటలు , 161/F లో 09 గుంటలు . 162/F లో 14 గుంటలు మొత్తం 33 గుంటలు కరీంనగర్ జిల్లా వల్లంపహాడ్ లో గల భూమిని ఖరీదు చేసి ప్లాట్ లుగా విభజించి పలువురికి విక్రయించగా సంపత్ కొనుగోలు చేశాడు. ఈ భూమికి పంబంధించిన తప్పుడు `విక్రయ దస్తావేజు రిజిస్ట్రేషన్ చేయించుకుని, కరీంనగర్ గోదాం గడ్డకు చెందిన అబ్దుల్ హఫీజ్ కు 33 గుంటలు గుత్తాగా విక్రయించారు. అందులో సర్వే నెంబర్ 159/F లో గల 10 గుంటల భూమిని కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన 7వ డివిజన్ కార్పోరేటర్ భర్త ఆకుల ప్రకాష్ పేరిట రిజిస్ట్రేషన్ చేశాడు. ఈ భూమిలో 3 గుంటలు , కరీంనగర్ కట్టరాంపూర్ కు చెందిన ఉప్పు సురేష్ కు, కరీంనగర్ వావిలాలపల్లికి చెందిన కట్ట రమ్యలు తక్కువ ధరకు కొనుగోలు చేసి అసలు విక్రయదారులను భూమిలో్కి రానివ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ ఏ ప్రదీప్ కుమార్ కేసు నమోదు చేసి నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి దుర్బుద్ధితో భూమిని కాజేయాలని ప్రయత్నించిన, అందుకు సహకరించిన ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో కార్పోరేటర్ భర్త ఆకుల ప్రకాష్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చగా 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కాంగ్రెస్ లో చేరుతే.. కేసుల నుంచి బయట పడుతారని పలువురు నేతల భావిస్తున్నారట. కానీ.. కండువా మార్చుకున్న.. చట్టం పని.. చట్టం చేస్తుందని పోలీసులు చెబుతున్నారు. భూ మాఫియా పై పోలిసుల చర్యలు తీసుకోవడంతో నగర ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…