Nune Sridhar: అవినీతికి ఆకలెక్కువ… ఇప్పటివరకు బయటపడ్డ రూ.150 కోట్ల అక్రమాస్తులు

అవినీతికి ఆకలెక్కువ అని విన్నాంకానీ... ఈ రేంజ్‌ ఆకలి ఉంటుందని నీటిపారుదలశాఖ అధికారి నూనె శ్రీధర్‌ని చూస్తే తెలుస్తోంది...! అక్రమాస్తులతో మొన్నే సెంచరీ కొట్టిన ఆయన... ఇప్పుడు డబుల్‌ సెంచరీవైపు దూసుకెళ్తున్నాడు. సోదాల్లో దొరికిన డాక్యూమెంట్స్ ఆధారంగా మరికొన్ని ఆస్తులను గుర్తించే అవకాశముంది. ముఖ్యంగా శ్రీధర్‌కు బినామీలుగా వ్యవహరించిన వారిని గుర్తించనున్నారు.

Nune Sridhar: అవినీతికి ఆకలెక్కువ... ఇప్పటివరకు బయటపడ్డ రూ.150 కోట్ల అక్రమాస్తులు
Nune Sridhar

Updated on: Jun 12, 2025 | 8:26 AM

ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ అక్రమాస్తులపై విచారణ ముమ్మరం చేసిన ఏసీబీ… షాకింగ్‌ విషయాలు బయటపెడుతోంది. కరీంనగర్‌ జిల్లా చొప్పదండి డివిజన్‌ ఈఈగా పనిచేస్తున్న నూనె శ్రీధర్‌కు చెందిన ఇళ్లు, బంధువుల నివాసాలు తదితర 13 ప్రాంతాల్లో ఏసీబీ బుధవారం ఏకకాలంలో సోదాలు చేపట్టింది. శ్రీధర్‌ ఉద్యోగం మీద కంటే కమీషన్ల మీదే ఎక్కువ ఫోకస్‌ పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్‌, కరీంనగర్‌లో విలువైన ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. తెల్లాపూర్‌లో ఖరీదైన విల్లా, అమీర్‌పేట్‌లో ఓ కమర్షియల్‌ కాంప్లెక్స్, హైదరాబాద్‌లో భారీ భవనం, వరంగల్‌లోనూ అపార్టుమెంట్లు, 16 ఎకరాల వ్యవసాయ భూములు,  19 ఇళ్ల స్థలాలు, రెండు కార్లు, బంగారు ఆభరణాలు కూడబెట్టినట్లు తేల్చారు. వీటి మొత్తం విలువ మార్కెట్‌లో 150 కోట్లు ఉంటుందన్నారు.

ఇక మార్చి 2న ఓ ఫామ్ హౌస్‌లో శ్రీధర్ తన కుమారుడి హల్దీ, సంగీత్ ఫంక్షన్లను ఘనంగా నిర్వహించాడని తెలిపారు ఏసీబీ అధికారులు. అంతేకాకుండా మార్చి 6న థాయిలాండ్‌లో కొడుకు వివాహం జరిపించాడని…. అలాగే మార్చి 9న నాగోల్‌లోని ఓ కన్వెన్షన్ హాల్‌లో ఎంతో వైభవంగా రిసెప్షన్‌ను చేసినట్లు తెలిపారు. కొడుకు వివాహం కోసం పెద్ద మొత్తంలో కోట్ల రూపాయలు గుమ్మరించినట్లు ఏసీబీ గుర్తించింది. శ్రీధర్ ముందు పలు డాక్యుమెంట్లను పెట్టి మరీ విచారిస్తున్న ఏసీబీ అధికారులు… మరిన్ని అక్రమాస్తుల వివరాలు రాబట్టే పనిలో ఉన్నారు.

మరిన్ని తెలంగాణఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి