వాయిస్ ఆఫ్ జగన్ అన్నట్టుగా పేరుతెచ్చుకున్న అంబటి రాంబాబు… బిరుదుకు తగ్గట్టే అరవీరభయంకరంగా ప్రత్యర్థులను టార్గెట్ చేస్తుంటారు. కాకపోతే, ఆయన ఎక్కువగా విమర్శలదాడి చేసేది మాత్రం జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణపైనే. మీడియా, సోషల్ మీడియా.. ఇంటాబయటా… అనే తేడా లేదు.. ఎక్కడ చూసినా పవన్‌ను ఓ చూపు చూడందే నిద్రపట్టదా? అన్నట్టు ఉంటుంది అంబటి దూకుడు. మంత్రి పదవి వచ్చాక.. అది మరీ ఎక్కువైందనుకోవచ్చు. జనసేన నుంచి సైతం.. అదేస్థాయిలో రివర్స్ కౌంటర్లు పడ్డప్పటికీ… ఎఫెక్టివ్‌గా మాత్రం కాదు. అయితే, ఇప్పుడు అమాత్యుడికి చుక్కలు చూపించే పనిలో బిజీగా ఉందట పవన్ పార్టీ.
ఛాన్సు దొరికినప్పుడల్లా జగన్ సర్కార్‌పై ఇంతెత్తున ఎగిరిపడుతున్న పవన్ కల్యాణ్… 2024 ఎన్నికలకు పక్కా ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది. అయితే, తన ఫస్ట్ టార్గెట్… మంత్రి అంబటి రాంబాబే అని స్పష్టమవుతోంది. అయిందానికి, కాని దానికి.. తనమీద విమర్శలు చేసే అమాత్యుడికి తగినరీతిలో లెస్సన్ నేర్పించాలనే కసితో జనసేనాని ఉన్నట్టు తెలుస్తోంది. అందుకు తగ్గట్టే వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. అంబటిపై ఇప్పటికే లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చినా.. ఇతరత్రా విమర్శలు వినిపించినా.. అవన్నీ కాదని… జనాల్లో ఏదైతే బలంగా వెళ్తుందో అదే అస్త్రాన్ని ఎంచుకున్నారు పవన్.
అందులో భాగంగానే.. గుంటూరు జిల్లా కౌలు రైతుల భరోసా యాత్రకు సంబంధించిన సభను… సత్తెనపల్లి నియోజకవర్గంలో నిర్వహించారు పవన్. అంబటి కాపుల గుండెల్లో కుంపటి అంటూ.. తీవ్ర విమర్శలే చేశారు. ప్రమాదవశాత్తు చనిపోయినవారి కుటుంబాలకు ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తే.. అందులో సగం లంచంగా ఇవ్వాలంటూ అంబటి డిమాండ్ చేస్తున్నారంటూ… అమాత్యుడిపై సంచలన ఆరోపణలు చేశారు పవన్. అంతటితో ఆగకుండా… ఈ ముచ్చటను జనాల్లోకి ఎన్నిక రకాలుగా తీసుకెళ్లాలో అన్ని రకాలుగా తీసుకెళ్తోంది జనసేన క్యాడర్. సో.. అవినీతి మరకలు అంటించి.. అమాత్యుణ్ని ఇలా ఇరుకున పెట్టేశారన్నమాట.
తాను లంచం తీసుకున్నట్టు నిరూపిస్తే… మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ జనసేనకు అంబటి గట్టిగానే సవాల్ విసిరారు. అయితే, అది కాస్తా బూమెరాంగ్ అయినట్టే ఉంది. ఎందుకంటే, జనసేన నేతలు వ్యూహాత్మకంగా బాధితులను మీడియా ముందుకు తీసుకొచ్చారు. వాళ్ల వాయిస్ రికార్డులను సోషల్ మీడియాలో పెట్టి గోలగోల చేసేశారు. అంబటీ.. ఇప్పుడు రాజీనామా చేయ్ అంటూ రీ సౌండ్ వచ్చేలా డిమాండ్ చేయడం మొదలెట్టారు. ఇలా జనసేన నేతలు చేస్తున్న ముప్పేట దాడితో అంబటి కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు సమాచారం.
మొత్తానికి, సమరం సత్తెన పల్లి నుంచే మొదలు.. అన్నట్టుగా ఉంది పవన్ వ్యూహం. తమ దూకుడుతో ఈసారి సత్తెనపల్లి సాక్షిగా జనసేన సత్తా ఏంటో చూపిస్తామన్న సంకేతాలు పంపిస్తున్నారు. అంతేకాదు, ఈసారి టీడీపీతో పొత్తు ఉన్నా… అందులో భాగంగా ఈ సీటును త్యాగం చేయాల్సి వచ్చినా… అంబటి ఓటమే తమ మెయిన్ టార్గెట్ అన్నట్టుగా ముందుకెళ్తున్నారు జనసేన నేతలు. యాదవ వర్గానికి చెందిన ఓ నేతను బరిలో నిలపాలనే ఆలోచన కూడా చేస్తోందట జనసేన. అలాగైతే, కమ్మసామాజిక వర్గానికి బీసీలు, కాపుల ఓట్లు కూడా తోడవుతాయనే లెక్కలేస్తోంది. సో.. ఫైనల్‌గా చెప్పొచ్చేదేంటంటే.. జనసేన ఫస్ట్ టార్గెట్ సత్తెనపల్లి. గబ్బర్ సింగ్ సినిమాలో రాస్కోరా సాంబా అన్నట్టు… అంబటిని అష్టదిగ్భందనం చేయడమే పనిగా పెట్టుకున్న పవన్ కల్యాణ్ ఒక ప్లాన్ ప్రకారమే ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది. మరి, ఈ ప్లాన్‌లో జనసేన ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
మరిన్ని ఏపీ న్యూస్ కోసం