Nagarjuna Sagar Project Dispute: తెలంగాణ పోలింగ్ రోజున ఏపీ అధికారులు 5వందల పోలీసుల బందోబస్త మధ్య నాగార్జున సాగర్ కుడి కాల్వ నుంచి 5వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం..13 గేట్లకు కంచె వేయడం సంచలనం రేపింది. ఏపీ , తెలంగాణ మధ్య నిప్పు రాజేసిన నీటి వివాదం ఢిల్లీని టచ్ చేసింది. తెలంగాణ ఫిర్యాదు మేరకు వెంటనే నీటి విడుదల ఆపేయాలని ఏపీని ఆదేశించింది కృష్ణా రివర్‌బోర్డు. ఆపై కేంద్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఏపీ, తెలంగాణ చీప్ సెక్రటరీలు, డీజీపీలతో వర్చువల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరిస్థితిని ఆరా తీశారు. నవంబరు 28కి ముందు ఉన్న పరిస్థితి కొనసాగిస్తూ, డ్యామ్ నిర్వహణను KRMBకి అప్పగించడంతో పాటు CRPF దళాల పర్యవేక్షణకు అప్పగించాలని సూచించింది కేంద్ర హోంశాఖ. ఈ ప్రతిపాదనకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అంగీకరించాయి. CRPF బలగాలు నాగార్జునసాగర్ డ్యామ్ దగ్గరకు చేరుకున్నాయి.
ఏపీ తెలంగాణ మధ్య నిప్పు రాజేసిన నీటివివాదం కేంద్రం జోక్యంతో చల్లబడింది. సాగర్ డ్యామ్ ను CRPF కంట్రోల్లోకి తీసుకుంది. ఐతే ఇప్పటికీ అటు ఏపీ.. ఇటు తెలంగాణ బలగాలు మోహరించివున్నాయి. వివాదం కేసుల వరకు వెళ్లింది. సరిగ్గా తెలంగాణలో పోలింగ్ టైమ్‌లోనే సాగర్ దగ్గర ఉద్రిక్తత చెలరేగడం పొలిటికల్ టర్న్ తీసుకుంది.
ఇవాళ కృష్ణా జలాల వివాదంపై కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలో కీలక సమావేశం జరుగనుంది. ఏపీ, తెలంగాణ చీఫ్ సెక్రటరీలు, సీఆర్పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్ డీజీలు..సీడబ్ల్యూసీ , కేఆర్‌ఎంబీ చైర్మన్‌లు ఈ మీటింగ్‌లో పాల్గొంటారు. సాగర్‌తో పాటు శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్వహణపై కూడా సమావేశంలో చర్చిస్తారు. మరోవైపు సుప్రీంకోర్టులో కృష్ణా జలాల వివాదం కేసు విచారణ జనవరి 12కు వాయిదా పడింది. కృష్ణా ట్రిబ్యూనల్‌కు నూతన విధివిధానాలపై సుప్రీంకోర్టులో సవాల్ చేసింది ఏపీ ప్రభుత్వం. పిటీషన్‌ను విచారించిన సుప్రీం కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి,తెలంగాణకు నోటీసులు ఇచ్చింది. కౌంటర్ దాఖలకు కేంద్ర జలశక్తి శాఖ సమయం కోరడంతో తదుపరి విచారణను 12కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ప్రస్తుతం సాగర్ డ్యామ్ సీఆరీపీఎఫ్ పర్యవేక్షణలో ఉంది. కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలో జరిగే కీలక భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..