తెలంగాణా రూలింగ్ పార్టీలోనే ఆయనో పెద్ద సౌండ్ పార్టీ. మైకు దొరికితే చాలు… స్టేట్‌లెవల్‌లో ఆయనిచ్చే సౌండే వేరు. చెప్పాల్సింది కొట్టినట్టు చెప్పడం ఆయన స్టయిల్. ఆశన్నగారి జీవన్ రెడ్డి… కేరాఫ్ ఆర్మూర్… నిజామాబాద్ జిల్లా. 2014, 2018లో రెండుసార్లు విజయఢంకా మోగించి… నేనే నంబర్ వన్ అంటారు. ఇంతకీ ఆయంది కాన్ఫిడెన్సా ఓవర్‌కాన్ఫిడెన్సా… జీనన్‌రెడ్డి విషయంలో ఆర్మూరు జనం తాజా ముఖచిత్రాలేంటి? పార్టీలో ఆయనకున్న ప్రయారిటీ మారిపోతోందా? ఆర్మూరుకి, జీవన్‌రెడ్డికి ఉండే అనుబంధం మాత్రం గట్టిదే.
విద్యార్థి ఉద్యమాలతో పొలిటికల్ అరంగ్రేటం చేసిన జీవన్ రెడ్డి.. ఆ తర్వాత జిల్లా స్థాయికి ఎదిగారు. 2001 నుండి టిఆర్ఎస్‌లో ఉంటున్నా.. ఓపిగ్గా వెయిట్ చేసి 2014లో టిక్కెట్ సాధించి ఆర్మూర్ ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆకుల లలితపై దాదాపు 30 వేల ఓట్ల తేడాతో గెలిచారు. తాను ఓడించిన ఆకుల లలితనే టీఆర్‌ఎస్‌లో చేరేలా చేశారన్నది ఆర్మూరులో ఓపెన్ సీక్రెట్. ఇలా జైత్రయాత్ర షురూ చేస్తున్న జీవన్‌రెడ్డికి… పార్టీలోపలే సెగ లేకుండా లేదు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, జడ్పీ చైర్మన్విఠల్రావు మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందన్నది టాక్.
విఠల్ రావు సీఎం కేసీఆర్‌కి బంధువు కావడం… జెడ్‌పీ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికై లోకల్‌గా పట్టు సాధించడం జీవన్‌రెడ్డికి మింగుడుపడ్డం లేదనేది పార్టీ క్యాడర్‌లో వినిపిస్తున్న మాట. విఠల్‌రావుతో ఎప్పటికైనా ఇబ్బందేనని గ్రహించిన ఆయన్ను నియోజకవర్గంలో తిరక్కుండా అడ్డుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు. వీళ్లిద్దరి పంచాయతీ కేసీఆర్ దృష్టిక్కూడా వెళ్లిందట. నాటోన్లీ విఠల్‌రావు… తానే దగ్గరుండి పార్టీలో చేర్పించిన ఆకుల లలిత కూడా జీవన్‌రెడ్డి జర్నీకి అడ్డు తగిలే ప్రమాదముంది.
ఆర్మూర్ టిక్కెట్ తనకే ఇవ్వాలని కేసీఆర్ దగ్గర ఆకుల లలిత అర్జీ పెట్టుకున్నారట. పార్టీ పెద్దలతో లాబీయింగ్ కూడా చేస్తున్న ఆకుల లలిత.. ఒకవేళ కుదరకపోతే… మళ్లీ కాంగ్రెస్ వైపు చూసే ఛాన్సుందట. ఆర్మూర్ కాంగ్రెస్‌లో చెప్పుకోదగ్గ లీడర్లెవరూ లేకపోవడంతో ఆమెనే పిలిచి టిక్కెట్టిస్తారన్నది గాంధీభవన్ టాక్.
ఇటు… బీజేపీ నుంచి వినయ్ రెడ్డి పేరు గట్టిగా వినిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు లోక్‌సభ ఎన్నికల్లో కూడా అనూహ్యమైన సంఖ్యలో ఓట్లు దక్కించుకున్న వినయ్‌రెడ్డి.. ఈసారి ఆర్మూర్ నుంచి తనకే చాన్స్ వస్తుందన్న ధీమాతో ఉన్నారు. కానీ.. ఎంపీ అర్వింద్ ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారని, ఆయన ఫస్ట్ ఛాయిస్ ఆర్మూరేనని బీజేపీ శిబిరంలో వినిపిస్తున్న మాట. అదే గనుక జరిగితే… వినయ్ రెడ్డి గోడదూకి కాంగ్రెస్‌లోకెళ్లి.. హస్తం గుర్తుపై పోటీ చేస్తారన్న ప్రచారం కూడా నడుస్తోంది. ఇలా… ఆర్మూర్‌లో జోరుగా నడుస్తోంది మ్యూజికల్ ఛెయిర్స్ ఆట.
ఏడు దశాబ్దాల చరిత్రున్న ఆర్మూర్ నియోజకవర్గంలో మూడు మండలాలు… లక్షా 78వేల 786మంది ఓటర్లు. ఇక్కడ ఓసీ, బీసీ ఓటర్లదే హవా. గుడాటి కాపు, మోటాటి కాపు కులస్థులకే 50శాతం ఓటుబ్యాంకుంది. ప్రధానంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన ఆర్మూర్ పేరు… ఎర్ర జొన్నలు, పసుపు ఉద్యమాలతో రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగిపోయింది. కానీ.. ఇక్కడ పేరుకుపోయిన సమస్యలు కూడా అదే రేంజ్‌లో ఉన్నాయి. అందుకే.. ఓట్లడుగుతున్న నేతల్ని గట్టిగానే నిలదీస్తున్నాడు ఆర్మూర్ ఓటరు.
ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అనేది మూడు దశాబ్దాల నుంచి నెరవేరని కలగానే మిగిలిపోయింది. నవనాథుల సిద్దుల గుట్ట అభివృద్ది కూడా మాటలకే పరిమితమైంది. 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను వంద పడకల ఆస్పత్రిగా మారుస్తామన్నవాళ్లూ పత్తా లేరు. ఉమ్మెడ నుంచి పంచగవ్వకు గోదావరిపై బ్రిడ్జి నిర్మాణం, ఆర్మూర్ పట్టణ ప్రజల తాగునీటి అవసరాలు.. అన్నీ ఎక్కడివక్కడే ఆగిపోయాయి. చేస్తాం చూస్తాం అనే హామీలే తప్ప.. ఆచరణ లేదనేది ఆరోపణ.
ఆర్మూర్ పసుపు రైతుల చైతన్యం దేశం దృష్టిని ఆకర్షించింది. పసుపు బోర్డు ఏర్పాటే ప్రధాన హామీగా నాయకులు రాజకీయాలు చేస్తున్నారు. దేశంలో ఇతర ప్రాంతాల్లో పండే పసుపు కంటే ఆర్మూర్ ప్రాంతంలో పండే పసుపుకే ఎక్కువ డిమాండ్. అయినా పసుపు బోర్డు తీరని కలే అవుతోంది.
ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సొంత డబ్బా కొట్టుకోవడమే తప్ప ఆర్మూర్ జన వెతల్ని పట్టించుకోరని గోరంత చేసి కొండంత చెప్పుకోవడం ఆయనకు అలవాటేనని ప్రతిపక్షాలు గగ్గోలు పెడతాయి. ఇరవైఏళ్ల కిందట టీడీపీ హయాంలో మొదలైన లెదర్ పార్క్ ఎదుగూబొదుగూ లేకుండా ఉంది… పట్టించుకోండి మొర్రో అంటున్నారు ఆర్మూరు జనం.
కనీసం స్మశానవాటికలకు ప్రహరీగోడలు కట్టలేని నేతలు.. అభివృద్ధి గురించి అంతలేసి మాట్టాడ్డం ఎందుకని నిలదీస్తున్నాయి ప్రజాసంఘాలు. జీవన్ రెడ్డి పై పోరాటం చేసిన తలారి సత్యం హత్యపై ఇప్పటికీ ఆరోపణలు వినిపిస్తున్నాయి. జీవన్ రెడ్డి పై ఉన్న వ్యతిరేకతే తనను గెలిపిస్తుందన్న ధీమాతో ఉంది ఆర్మూర్ బిజేపీ. ఎన్నికల కోసమే పర్యటనలు చేస్తున్న ఎమ్మెల్యేని ఓడించి తీరతామంటున్నారు బీజేపీ ఇన్‌చార్జ్ వినయ్ రెడ్డి.
ఆరునూరైనా ఆర్మూర్ నాదే అనే ధీమాను మాత్రం వదిలిపెట్టడం లేదు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి. రెండున్నర వేల కోట్లతో డెవలప్‌మెంట్ చేశా.. నన్నోడించే మొనగాడెవడు, హ్యాట్రిక్ విక్టరీ మీద కన్నేశారాయన. ఎంపీ అర్వింద్ వచ్చినా ఆర్మూర్‌లో అదిరేదీ లే బెదిరేదీ లే అంటారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం