
డ్యూటీలో చేరిన వెంటనే చాలా మంది అధికారులు ఆఫీస్‌లో రికార్డులు పరిశీలిస్తారు. కానీ ఇక్కడో ఆఫీసర్ మాత్రం.. నేరుగా యాక్షన్‌లోకి దిగేసింది. నగరంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు ఆర్థరాత్రి మారువేశంలో రోడ్లపైకి వచ్చి పరిస్థితి అంచనా వేసింది.. ఆ సమయంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిచేందుకు ప్రయత్నించిన 40 మంది కేటుగాళ్ల ఆట కట్టించి వారికి కౌన్సలింగ్ ఇప్పించింది. వివరాల్లోకి వెళ్తే.. 2006 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సుమతి మే 1న మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. మహిళల భద్రత, ఇంటెలిజెన్స్, మావోయిస్టు ఆపరేషన్లలో అనుభవం ఉన్న అధికారిగా ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. గతంలో సీఐడీ మహిళా రక్షణ విభాగంలో డీఐజీగా కూడా పనిచేశారు.
పోలీసు వర్గాలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం.. కమిషనర్ సుమతి సాధారణ సల్వార్ సూట్ ధరించి రాత్రి సుమారు 12:30 గంటల సమయంలో దిల్‌సుఖ్‌నగర్ బస్టాప్ వద్ద ఒంటరిగా నిలుచున్నారు. చేతిలో మొబైల్ ఫోన్ తప్ప మరేమీ లేకుండా అక్కడ పరిస్థితులను గమనించారు. అయితే కొంత దూరంలో సివిల్ డ్రస్‌లో పోలీసులు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది.
అయితే ఆమె అక్కడ నిలబడిన కొద్ది నిమిషాల్లోనే పలువురు వ్యక్తులు దగ్గరకు వచ్చినట్లు సమాచారం. కొందరు మాట్లాడేందుకు ప్రయత్నించగా.. మరికొందరు చుట్టూ తిరుగుతూ గమనించినట్లు తెలుస్తోంది. రాత్రి క్రమంగా ముదురుతున్న కొద్దీ పరిస్థితి అసౌకర్యంగా మారినట్లు చెబుతున్నారు. దాదాపు 40 మంది వరకు ఆమెను చుట్టుముట్టేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. వారిలో కొందరు మద్యం మత్తులో ఉండి అసభ్యకర వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. పరిస్థితి అదుపు తప్పేలా కనిపించడంతో అక్కడే గమనిస్తున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. అనుమానాస్పదంగా ప్రవర్తించిన పలువురిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు సమాచారం. అయితే వెంటనే కేసులు నమోదు చేయకుండా.. వారిని కౌన్సెలింగ్ చేసి హెచ్చరించినట్లు తెలుస్తోంది.
సోషల్ మీడియాలో ప్రశంసలు
మహిళల భద్రతపై ఫైళ్లలో వచ్చే నివేదికలకే పరిమితం కాకుండా.. స్వయంగా రోడ్లపైకి వచ్చి వాస్తవ పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేయడం పట్ల పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. గ్రౌండ్ రియాలిటీ తెలుసుకునే పోలీసింగ్ ఇదే, “మహిళలు ప్రతిరోజూ ఎదుర్కొనే వేధింపుల్ని బయటపెట్టిన ఆపరేషన్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే నగరంలో అర్ధరాత్రి సమయంలో మహిళలు ఇంకా భయాందోళనల మధ్యనే ప్రయాణించాల్సి వస్తోందని ఈ ఘటన మరోసారి చూపించిందంటూ చర్చ జరుగుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.