
హనుమకొండ, జనవరి 29: ఇంటర్ విద్యార్ధిని కొన్నాళ్లుగా మరో విద్యార్ధితో ప్రేమాయణం సాగిస్తుంది. ఇటీవల ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రియుడ్ని ఇంటికి పిలిచింది. ఇంతలో ఇంటికొచ్చిన ఆమె తండ్రి కూతురితో వేరొక బాలుడు చనువుగా ఉండటం చూసి రక్తం మరిగిపోయింది. వెంటనే కత్తి తీసుకుని కూతురి ప్రియుడిపై దాడి చేశాడు. కత్తితో గొంతు కోయడంతో భయంతో ప్రియుడు బయటకు పరుగులు తీశాడు. దీంతో ఆవేదనకు గురైన కూతురు గదిలోకెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర ఘటన హనుమకొండ నగరంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..
హనుమకొండ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలిక స్థానికంగా ఉన్న ఓ జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. ఆమెకు వరంగల్ ప్రాంతానికి చెందిన ఓ బాలుడి (17)తో కొన్నాళ్ల క్రితం స్నేహం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారడంతో మంగళవారం ఇంట్లో ఎవరూ లేరని అతన్ని ఇంటికి పిలిచింది. అయితే ఉద్యోగం నిమిత్తం బయటకు వెళ్లిన బాలిక తండ్రి సాయంత్రం ఇంటికి వచ్చాడు. అదే సమయంలో ఇంట్లో తన కూతురితో మరో బాలుడు చనువుగా ఉండటం చూసి.. కోపోధ్రిక్తుడైన తండ్రి అతడిపై దాడి చేశాడు. అనంతరం ఇంట్లో ఉన్న కత్తి తీసుకొని అతడి గొంతు కోశాడు. దీంతో బాలుడు రక్తం మోడుతూ బయటకు పరుగులు తీశాడు.
అతడిని తరుముతూ బాలిక తండ్రి కూడా వెనుకే పరుగు తీశాడు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన బాలిక ఇంట్లో గడియ పెట్టుకొని ఉరి వేసుకుని మృతి చెందింది. ఇంటికి తిరిగొచ్చిన తండ్రి తలుపులు పగులగొట్టి చూడగా, అప్పటికే కూతురు విగతజీవిగా వెలాడుతూ కనిపించింది. దీంతో కుమార్తె మృతదేహాన్ని పట్టుకుని గుండెలవిసేలా రోదించాడు. మరోవైపు గొంతు తెగిన బాలుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. దీనిపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని, ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్సై రవీందర్ మీడియాకు తెలిపాడు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.