
ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి అటవీ డివిజన్ పరిధిలో ప్రకృతి ప్రేమికులను, వన్యప్రాణి విభాగం అధికారులను ఉత్సాహపరిచే అరుదైన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. తల్లాడ, కల్లూరు, పెనుబల్లి మండలాల సరిహద్దుల్లో విస్తరించి ఉన్న కనకగిరి (పులిగుండాల) అడవుల్లో రెండు చిరుత పులులు స్వేచ్ఛగా సంచరిస్తూ కెమెరాకు చిక్కాయి.
వన్యప్రాణుల కదలికలను గమనించేందుకు అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలలో ఈ చిరుతల దృశ్యాలు రికార్డయ్యాయి. ఒక జంతువు కళేబరం చుట్టూ ఈ రెండు చిరుతలు తిరుగుతూ భుజిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. గత నెలలో కూడా ఒక చిరుత తన పిల్లలతో ఆడుకుంటున్న వీడియోను అధికారులు విడుదల చేశారు. వరుసగా చిరుతల ఉనికి కనిపిస్తుండటంతో ఈ ప్రాంతం వన్యప్రాణుల మనుగడకు అత్యంత అనుకూలంగా మారిందని స్పష్టమవుతోంది.
సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు అటవీ ప్రాంతాల్లో ప్రస్తుతం జీవవైవిధ్యం వెల్లివిరుస్తోంది. ఈ అడవుల్లో కేవలం చిరుతలే కాకుండా.. జింకలు, దుప్పులు, అడవి దున్నలు, అరుదైన పక్షులు ఇలా ఎన్నో రకాల జాతులు ఇక్కడ నివసిస్తున్నాయి. క్రూర మృగాలతో పాటు వాటికి ఆహారంగా లభించే శాకాహార జంతువులు కూడా సమృద్ధిగా ఉండటం ఇక్కడి పర్యావరణ సమతుల్యతకు నిదర్శనం.
ఈ పరిణామంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ శాఖ అధికారి (DFO) సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. “ఒకే ఆవాసంలో వేర్వేరు జాతుల జంతువులు సంచరించడం అనేది ఆరోగ్యవంతమైన అడవికి సంకేతం. కనకగిరి అడవుల్లో ఉష్ణోగ్రత, నీటి వసతి, ఆహారం వన్యప్రాణులకు అనువుగా ఉన్నాయి. అడవులను, వన్యప్రాణులను రక్షించుకోవడం మన బాధ్యత, ఎందుకంటే అవి ఉంటేనే మానవ మనుగడ సాధ్యమవుతుంది” అని ఆయన పేర్కొన్నారు.
పులిగుండాల ఎకో టూరిజం ప్రాంతంలో ఈ చిరుతల సంచారం పర్యావరణవేత్తల్లో ఆశలు రేకెత్తిస్తోంది. పచ్చని అడవులు, పెరిగిన జంతువుల సంఖ్య సత్తుపల్లి అటవీ ప్రాంతాన్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా తీర్చిదిద్దేలా కనిపిస్తున్నాయి. అటవీ సంపదను కాపాడుకుంటూ, వన్యప్రాణులకు హాని కలిగించకుండా చూడాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
వీడియో ఇక్కడ చూడండి…
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..