AP and TS Assembly Seats: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ సీట్ల పెంపుపై దాఖలైన రిట్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. సుప్రీం విచారణతోనైనా కేంద్రంలో కదలిక వచ్చి ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపుపై స్వీట్ న్యూస్ వస్తుందేమోనని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను 119 నుంచి 153కి, ఆంధ్రప్రదేశ్‌లో 175 నుండి 225కు పెంచాలని, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 లోని నిబంధనను అమలు చేసేలా కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పర్యావరణ నిపుణుడు ప్రొఫెసర్ కె పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వానికి, ఎలక్షన్ కమిషన్‌కు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది.
ఈ ఏడాది మొదట్లో జమ్మూ-కాశ్మీర్‌లో డీలిమిటేషన్ ప్రక్రియను సవాలు చేసిన రిట్ పిటిషన్‌తో పాటు ఈ రిట్ పిటిషన్‌ని ట్యాగ్ చేయమని సుప్రీంకోర్టు ఆదేశించింది. తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపుదల, విభజన చట్టంలోని సెక్షన్ 26, రాజ్యాంగంలోని 170వ అధికరణంలోని నిబంధనలకు లోబడి ఉండాలని, అందువల్ల 2031 తర్వాత జరిగే జనాభా లెక్కలు అందుబాటులోకి వచ్చేవరకు అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచే అవకాశం ఉండదని కేంద్రం గతంలోనే తెలిపింది.
అయితే ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపు ప్రక్రియ ఇప్పుడు జమ్మూకాశ్మీర్‌లో అసెంబ్లీ సీట్ల పెంపుతో ముడిపడడం ఆసక్తికరంగా మారింది. సుప్రీంకోర్టులో విచారణ తర్వాత కాశ్మీర్‌లో డీలిమిటేషన్ ప్రక్రియ రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లు తీర్పు వస్తే అక్కడ ఇప్పటికే ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల ఆధారంగానే ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది. మరోవైపు కాశ్మీర్ లో సీట్ల సంఖ్యను పెంచడానికి మార్గం సుగమమైతే అది రెండు తెలుగు రాష్ట్రాల్లో సీట్ల సంఖ్యను పెంచే ప్రక్రియకు మార్గం చూపిస్తుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..