Telangana: జీవితాన్ని గట్టెక్కిస్తానంటూ.. యువతిని గదిలోకి పిలిచిన పూజారి.. తీరా చూస్తే..!

| Edited By: Balaraju Goud

Sep 07, 2024 | 12:48 PM

అభం శుభం తెలియని ఆ మహిళలు గుడ్డిగా నమ్మి మంచి జరుగుతుందంటే ఎలాంటి పూజలు చేయడానికైనా సిద్ధపడతారు. సరిగ్గా ఈ అమాయకత్వమే బాబాలు, స్వామీజీల పేరుతో ముసుగు వేసుకున్న కొందరు దుర్మార్గుల పాలిట వరంగా మారుతోంది.

Telangana: జీవితాన్ని గట్టెక్కిస్తానంటూ.. యువతిని గదిలోకి పిలిచిన పూజారి.. తీరా చూస్తే..!
Odisha News
Follow us on

మహిళలపై అమానుష ఘటనలు ఆగట్లేదు. అమాయకులైన ఆడపిల్లలను నమ్మబలికి మంచి జరుగుతుందని, ఈ పూజ చేయాలని, కుటుంబంలో సమస్యలు తీరుతాయని ఇలా వారికష్టాల జీవితాన్ని గట్టెక్కిస్తామని చెప్పి దారుణానికి ఒడిగట్టిన సంఘటనలు గతంలో ఎన్నో చూశాం. ముఖ్యంగా మధ్యతరగతి స్త్రీలు ఇలాంటి వాటికి ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. అభం శుభం తెలియని ఆ మహిళలు గుడ్డిగా నమ్మి మంచి జరుగుతుందంటే ఎలాంటి పూజలు చేయడానికైనా సిద్ధపడతారు. సరిగ్గా ఈ అమాయకత్వమే బాబాలు, స్వామీజీల పేరుతో ముసుగు వేసుకున్న కొందరు దుర్మార్గుల పాలిట వరంగా మారుతోంది. ఇలాంటి సంఘటనే తాజాగా హైదరాబాద్ మహానగరం పాతబస్తీలో చోటు చేసుకుంది.

పాతబస్తీ ఏరియాలో ఓ పూజారి అమ్మాయిలను పూజల పేరుతో లోబర్చుకుంటున్నాడు. ఏవైనా సమస్యలతో సతమతమయ్యే కుటుంబాలపై కన్నేసి వారికి మాయమాటలు చెప్పి ఒప్పిస్తాడు. వారికి మంచి జరుగుతుందని చెప్పి నమ్మించి, పూజ చేస్తే మీ కష్టాలన్నీ తీరుతాయని నమ్మబలుకుతాడు. ఇదే క్రమంలో పూజ పేరుతో ఇటీవల ఓ అమ్మాయిని గదిలోకి తీసుకెళ్లి తల్లిదండ్రులను బయటికి పంపించేశాడు. అది నమ్మి నిజంగానే ఆ భార్యాభర్తలు పూజ నిమిత్తం తమ కూతురిని పూజారికి అప్పగించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత అదను చూసుకుని ఆ పూజారి అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. పూజారి వేధింపులు తాళలేక ఆ యువతి కేకలు వేస్తూ గది నుంచి బయటికి పరుగులు పెట్టింది. వెంటనే లోపల జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులకు ఏడుస్తూ చెప్పింది. అసలు విషయం గ్రహించిన ఆ తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతగాడిని అరెస్ట్ చేశారు.

ఈ ఘటన పాతబస్తీలోని బహదూర్ పుర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నిందితుడిని రామకిషోర్ జోషిగా గుర్తించారు. బహదూర్ పుర హౌసింగ్ బోర్డు కాలనీలో ఆ పూజారి నివాసం ఉంటున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. గత కొన్ని రోజులుగా ఇలాంటి ఆగడాలకు పాల్పడుతూ అమాయకులైన మహిళలపై దారుణాలకు ఒడిగడుతున్నట్లు తెలుసుకున్నారు. ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకుని అతనిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఏది ఏమైనా ప్రపంచం పరుగులు పెడుతున్న ఇలాంటి కాలంలో కూడా మూఢ నమ్మకాలపై అప్రమత్తంగా వ్యవహరించాలని, దుర్మార్గుల చేతిలో బలి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..