
ఓవైపు నైరుతి రుతుపవనాలు మరో వారం రోజుల్లో కేరళా తీరాన్ని తాకనున్నాయని.. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు ఎండవేడి నుంచి ఉపశమనం కలుగుతుందని అనుకునే లోపే వాతావరణం శాఖ మరో బాంబ్ పేల్చింది. రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఏపీ, తెలంగాణలో ఎండలు మరింత మండిపోతాయని హెచ్చరించింది. ఇవాళ ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయన్న వాతావరణశాఖ.. పలుచోట్ల 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఏపీలో ఇవాళ 47 మండలాల్లో తీవ్ర వడగాలులు.. 88 మండలాల్లో వడగాలులు వీస్తాయని పేర్కొంది.
ఇక, తెలంగాణలోనూ 2-3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరుగుతాయంటోందని.. ఉత్తర తెలంగాణలో ఈ రోజు, రేపు తీవ్ర వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఎండల తీవ్రత నేపథ్యంలో జనాలు ఎవరూ ఉదయం 11 నుంచి సాయంత్రం 4గంటల వరకు ఇళ్ల నుంచి బయటికి రావొద్దని సూచించింది. అలాగే ఎండల పట్ల అతప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.
కేవలం రెండు తెలుగు రాష్ట్రాలకే కాదు.. అటు ఉత్తర భారతంలోనూ ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే 3-5 డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఢిల్లీ ,రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్,ఛత్తీస్‌గఢ్‌లో వారం రోజుల పాటు సీవియర్ హీట్‌వేవ్ పరిస్థితులు ఉండనున్నాయి.ఈ నేపథ్యంలో ఢిల్లీకి నాలుగు రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ
వారం రోజుల పాటు గరిష్టంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకానున్నట్లు వెల్లడించిన ఐఎండీ.. ఢిల్లీలో ఉదయం 7 గంటలకే 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతున్నట్టు పేర్కొంది. పాకిస్తాన్-రాజస్థాన్ నుంచి వీస్తున్న వేడిగాలులతో ఎండలు పెరుగుతున్నట్టు తెలిపింది. మధ్యాహ్నం సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని..పిల్లలు, వృద్ధులు, బయట పని చేసే వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు ఎవరూ బయటకెళ్లొద్దని పేర్కొంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.