
ఎండల ముదిరి ఉక్కపోతలు మొదలైన వేళ కూల్ న్యూస్ వచ్చింది. తెలంగాణలో ఆది, సోమ, మంగళవారాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌లోని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మార్చి 18 వరకు ఉదయం వేళల్లో నగరంలో పొగమంచు వాతావరణం ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. కాగా, గురువారం తెలంగాణలోని పలు జిల్లాల్లో 41 డిగ్రీల సెల్సియస్‌కు చేరువలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లాలో అత్యధికంగా.. 40.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
హైదరాబాద్‌లోనూ గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదైంది. నగరంలోని పాటిగడ్డలో అత్యధికంగా గురువారం 40.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. IMD హైదరాబాద్ అంచనా వేసిన వర్షం.. ఉక్కుపోతల నుంచి తెలంగాణ వాసులకు ఊరటనిస్తుందో లేదో చూడాలి.
మార్చిలోనే మండుతున్న ఎండలు…
మార్చినెల సగం గడవక ముందే తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 9 దాటితే భానుడు భగభగ రగిలిపోతున్నాడు. ఇక రాబోయే రోజుల్లో ఎండులు విపరీతంగా ఉంటాయని పిల్లలు, వృద్ధులు ఇళ్లల్లో నుంచి బయటకు రావొద్దని జిల్లా అధికారులు, డాక్టర్లు సూచిస్తున్నారు. ఎండలు పెరగడంతో వడదెబ్బ పొంచి ఉంది. ఏటా వడదెబ్బకు పదుల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. అలానే అతిసారం, డయేరియా, వడదెబ్బ వంటి సీజనల్ వ్యాధుల నిర్మూలనకు తగిన చర్యలు తీసుకోవాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..