
సాధారణంగా ఐఐటీ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల నుంచి ఇంజినీరింగ్ పట్టా పుచ్చుకున్న వారికి లక్షల్లో జీతాలు, విదేశీ అవకాశాలు, కార్పొరేట్ జీవనశైలి కళ్ల ముందు మెదులుతాయి. కానీ ఐఐటీ ఖరగ్‌పూర్ పూర్వ విద్యార్థి లోమాడ నాగేంద్ర సాయికి మాత్రం డిగ్రీ పూర్తయ్యే సమయానికి ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా మహమ్మారి కారణంగా ఆ ఆశలపై నీళ్లు చల్లింది. కంపెనీలు లేఆఫ్‌లు ప్రకటించడం, కొత్త నియామకాలు నిలిచిపోవడంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల కోసం ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అయినప్పటికీ ఏ మాత్రం నిరాశ చెందకుండా, కెరీర్‌ను మెరుగుపరుచుకునే దిశగా అడుగులు వేశారు. ఫలితంగా, నిరంతర సాధన, అలుపెరగని పోరాటం ద్వారా 14 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను సాధించి విజయానికి ప్రతీకగా నిలిచారు. కడపకు చెందిన అశ్విని కుమార్, రాజరాజేశ్వరి దంపతుల కుమారుడు నాగేంద్ర సాయి. చిన్నతనం నుంచే చదువులో చురుకుగా ఉండే ఆయనను తల్లిదండ్రులు ప్రోత్సహించారు. సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగం లభించకపోవడంతో, ప్రైవేట్ రంగంలో ఉద్యోగ భద్రత తక్కువని గ్రహించిన నాగేంద్ర సాయి, ప్రభుత్వ కొలువు సాధించాలని నిర్ణయించుకున్నారు. ఇంటి నుంచే ప్రిపరేషన్ మొదలుపెట్టారు. 2023లో దాదాపు ఐదు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్షలు రాసినా, ఒక్కటీ రాలేదు. దీంతో ఇప్పుడున్న సన్నద్ధత సరిపోదని భావించి, హైదరాబాద్‌కు వెళ్లి ఆరు నెలల కోచింగ్ తీసుకున్నారు. ఈ క్రమంలో, ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ పరీక్షలో కీ చూశాక మార్కులు బాగా రావడంతో ఉద్యోగం ఖాయమని అనుకున్నారు. కానీ నార్మలైజేషన్ కారణంగా స్కోర్ తగ్గిపోవడంతో ఆ జాబ్ మిస్ అయింది. “నా రా స్కోర్ 325. ప్రీవియస్ కటౌఫ్ 280, 290 మాత్రమే. జాబ్ వచ్చేస్తుందని అందరికీ చెప్పేశాను. కానీ రిజల్ట్‌లో నా పేరు లేదు. షాక్ అయ్యాను” అని నాగేంద్ర సాయి ఆనాటి అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. అయినా నిరాశ చెందకుండా, తన లోపాలను సరిదిద్దుకొని తిరిగి సన్నద్ధమయ్యారు.
“జాబ్ వచ్చేవరకు ఎవరికీ తెలియకూడదు. కీప్ ఇట్ ప్రైవేట్ అంటిల్ ఇట్ గెట్ పర్మనెంట్ అని ఫిక్స్ అయ్యాను” అని ఆయన పేర్కొన్నారు. 2025లో మళ్లీ హైదరాబాద్‌లోని ఎవరేజ్ కోచింగ్ పాయింట్‌కు వచ్చి స్టడీ హాల్‌లో కూర్చుని చదువుకున్నారు. ఈసారి తన వ్యూహాన్ని మార్చుకున్నారు. 2024లో కేవలం ఎస్‌ఎస్‌సీ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) పరీక్షలకే దరఖాస్తు చేసిన తప్పును సరిదిద్దుకోవాలని నిర్ణయించుకున్నారు. 2025లో విడుదలైన అన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేశారు. దాదాపు 30కి పైగా పరీక్షలు, అవి సీజీఎల్, సీహెచ్‌ఎస్‌ఎల్, ఎంటీఎస్ ఫేస్ 13, ఎన్‌టీపీసీ, ఆర్ఆర్‌బీ, ఎయిమ్స్ సీఆర్‌ఈ, ఈఎస్‌ఐసీ, నావీ, కోస్ట్ గార్డ్, ఐఎన్‌సెట్ వంటివి రాయడం ద్వారా అపారమైన అనుభవాన్ని పొందారు. రోజుకు 12 నుంచి 14 గంటలు చదువుతూ, అలుపెరగకుండా కృషి చేశారు. ఆ కఠోర సాధన ఫలితంగా వరుసగా 14 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను సాధించారు. ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లాలోని ఈఎస్‌ఐసీలో సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
నాగేంద్ర సాయి తల్లిదండ్రులు ఆయన విజయం పట్ల అమితానందాన్ని వ్యక్తం చేశారు. “మా సహకారం మేము ఇచ్చినా, వాని కృషి చాలా ఎక్కువ ఉండడం వల్లనే ఇన్ని ఉద్యోగాలు సంపాదించాడు. మా ఆనందానికి అవధులు లేవు” అని వారు సంతోషంగా చెప్పారు. నాగేంద్ర సాయి సోదరి కూడా ఆయనకు అభినందనలు తెలిపి, ఇలాగే ఎందరికో ఆదర్శంగా ఉండాలని ఆకాంక్షించారు. మొత్తంగా చూస్తే, కరోనా కారణంగా ఏర్పడిన లేఆఫ్‌ల భయంతో మొదలైన ప్రయాణం, 14 ప్రభుత్వ కొలువులను సాధించి రికార్డు సృష్టించింది. సన్నద్ధతలో స్పష్టత, సాధనలో పట్టుదల ఉంటే విజయం సొంతమవుతుందని నాగేంద్ర సాయి నిరూపించారు. ఆయన ప్రయాణం ఈ మార్గంలో ఉన్న ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అనడంలో సందేహం లేదు.