
సెకండ్ లిస్ట్ తర్వాత సీనియర్ల అలకలు.. నిరసనలతో టికెట్ల పంచాయితీ జరుగుతుండగానే… విజయభేరి యాత్ర మొదలుపెట్టారు పీసీసీ పెద్దలు. నిన్నటిదాకా ఢిల్లీలో టికెట్లపై కసరత్తు చేసిన రాష్ట్ర నాయకత్వం ఇప్పుడు ప్రచారంపై దృష్టి పెట్టింది. ఉత్తరతెలంగాణలో తొలివిడత పూర్తిచేసిన హస్తం పార్టీ.. సెకండ్ ఫేజ్‌లో దక్షిణ తెలంగాణతో పాటు.. గ్రేటర్‌పై ఫోకస్ పెట్టింది. గ్యారెంటీలను జనాల్లోకి బలంగా తీసుకెళ్లడమే లక్ష్యంగా యాత్ర చేస్తున్న కాంగ్రెస్ ముందున్న సవాళ్లేంటి?
కాంగ్రెస్ నిర్వహిస్తున్న విజయభేరి రెండో విడత బస్సు యాత్ర మొదలైంది. వికారాబాద్ జిల్లా తాండూరు నుంచి మొదలైన విజయభేరి యాత్ర నవంబర్ 2 వరకు కొనసాగనుంది. ఈనెల 18 నుంచి మూడురోజుల పాటు రాహుల్, ప్రియాంక చేతుల మీదుగా ఉత్తరతెలంగాణలో తొలివిడత విజయభేరి బస్సు యాత్ర చేపట్టింది కాంగ్రెస్. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో యాత్ర సాగింది. సెకండ్ ఫేస్ యాత్రను దక్షిణ తెలంగాణతో పాటు.. గ్రేటర్ పరిధిలో పలు నియోజకవర్గాల్లో ఉండేలా షెడ్యూల్ చేసింది రాష్ట్ర నాయకత్వం. 6 రోజుల యాత్రలో డీకే శివకుమార్, మల్లికార్జున ఖర్గే, ప్రియాంకగాంధీ, రాహుల్ పాల్టొంటారని పార్టీ చెబుతోంది.
తాండూరు నుంచి మొదలైన రెండో దశ యాత్రలో కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పాల్గొన్నారు. కర్నాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు.. అమలు చేస్తున్న తీరును ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. సరిహద్దు ప్రాంతం కూడా కావడంతో అక్కడ సహజంగానే ఆయా వర్గాలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది హస్తం పార్టీ. మరోవైపు కాంగ్రెస్ యాత్రను టార్గెట్ చేసింది అధికార బీఆర్‌ఎస్. కర్నాటక నుంచి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వచ్చి ఇక్కడి ప్రజలకు ఏం చెబుతారని ప్రశ్నించారు మంత్రి హరీష్‌రావు. తమ రాష్ట్రంలో 3 గంటల కరెంట్ కూడా ఇవ్వలేని వాళ్లు మాయమాటలు నమ్మి మోసపోవద్దన్నారు హరీష్‌రావు. ఇచ్చిన మాట.. చెప్పిన హామీలు నెరవేర్చే బలమైన సీఎం అభ్యర్థి కావాలా… బలహీన పాలన కావాలో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు హరీష్‌రావు. మొత్తానికి విజయభేరి యాత్రను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. విజయయాత్రగా మలుచుకుంటామంటోంది. మరి గ్యారెంటీలపై బీఆర్ఎస్ వేస్తున్న సవాల్‌కు సమాధానమేంటి? బీజేపీ ఎత్తుకున్న బీసీ నినాదానికి పోటీగా ఏం చేయబోతుంది.?