
ఏపీ ఎన్నికల్లో తమ పాత్ర ఏమీ ఉండదని టీఆర్‌ఎస్ నేత కేటీఆర్ స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు ఐదేళ్ల పాలన గురించి చెప్పుకోలేక… తమపై పడి ఏడుస్తున్నారని ఎద్దేవాచేశారు. ‘ఏప్రిల్ 11 తర్వాత మేం రిటర్న్ గిఫ్ట్ ఇచ్చామా? లేదా? అన్నది తెలుస్తుంది’ అని కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్‌కు వచ్చే సీట్లు జాతీయ పార్టీల కంటే ఎక్కువగా ఉంటాయని, జాతీయ పార్టీ పెట్టొచ్చు…తప్పేముందని ఆయన వ్యాఖ్యానించారు.
ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ రాష్ట్ర ప్రజలకు త్వరలోనే ఒక అప్పీల్ చేయబోతున్నారని తెలిపిన విషయం తెలిసిందే. లోక్‌సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసిపోతుందని జోస్యం చెప్పారు. తెలంగాణ కేంద్రంగా పనిచేస్తున్న తమ పార్టీ టీఆర్‌ఎస్‌కు ఏపీలో అడుగుపెట్టాలన్న ఆలోచనలేమీ లేదని చెప్పారు. టీడీపీ, కేసీఆర్ మధ్య పోరుగా ఏపీ ఎన్నికలను చిత్రీకరించాలని బాబు ప్రయత్నించడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. టీఆర్‌ఎస్‌కు ఏపీలో ఒక్క చోట కూడా పార్టీ కార్యాలయం లేదని, ఎన్నికల్లో కూడా అక్కడ తాము పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు.