Uppal: రాత్రి వేళ రోడ్డుపై అనుమానాస్పదంగా మహిళ.. ఏంటా అని ఆరా తీయగా..

హైదరాబాద్ ఉప్పల్‌లో రాత్రివేళ ఒంటరిగా తిరుగుతున్న మహిళను అప్రమత్తంగా గుర్తించిన పోలీసులు, ఆమె వివరాలు సేకరించి కుటుంబ సభ్యులను సంప్రదించి సురక్షితంగా అప్పగించారు. ఉప్పల్ పోలీసుల తక్షణ స్పందనకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి ..

Uppal: రాత్రి వేళ రోడ్డుపై అనుమానాస్పదంగా మహిళ.. ఏంటా అని ఆరా తీయగా..
Uppal Police Rescue

Edited By:

Updated on: Jun 20, 2026 | 9:47 PM

హైదరాబాద్‌లోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బగాయత్ ప్రాంతంలో రాత్రి వేళ అనుమానాస్పద పరిస్థితుల్లో ఒంటరిగా తిరుగుతున్న ఓ మహిళను పోలీసులు గుర్తించి, ఆమెను సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసుల అప్రమత్తత, వేగవంతమైన స్పందనపై కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగోల్‌లోని మమతా నగర్‌కు చెందిన బుడిగ స్వాతి (56) కుటుంబ కలహాల కారణంగా ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె తిరిగి ఇంటికి వెళ్లాలా వద్దా అనే అయోమయంలో ఉప్పల్ బగాయత్ ప్రాంతంలో రాత్రి వేళ ఒంటరిగా కనిపించారు. విధుల్లో ఉన్న ఉప్పల్ పోలీసులు ఆమెను గమనించి వెంటనే మాట్లాడి వివరాలు సేకరించారు. అదే సమయంలో నాగోల్ పోలీస్ స్టేషన్‌లో స్వాతి గల్లంతైనట్లు మిస్సింగ్ కేసు నమోదు అయినట్లు గుర్తించి, సంబంధిత పోలీస్ స్టేషన్‌తో సమన్వయం చేసి కుటుంబ సభ్యులను సంప్రదించారు. అనంతరం ఆమెను క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ఈ సందర్భంగా స్వాతి కుటుంబ సభ్యులు ఉప్పల్ పోలీసుల తక్షణ స్పందనను అభినందించారు. ముఖ్యంగా కానిస్టేబుళ్లు శివకృష్ణ, మోహన్ చూపిన చొరవ, మానవత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు కీలక సూచనలు చేశారు. కుటుంబ సమస్యల కారణంగా ఎవరైనా భావోద్వేగానికి లోనై ఇంటి నుంచి వెళ్లిపోయినట్లయితే, ఆలస్యం చేయకుండా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. అలాగే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కుటుంబ సభ్యులు పరస్పరం జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటన మరోసారి పోలీసుల అప్రమత్తత, మానవీయ దృక్పథం ప్రజల్లో భరోసా పెంచిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us