
హైదరాబాద్ ప్రజలకు గుడ్‌న్యూస్.. త్వరలోనే కొత్త ఎలక్ట్రిక్ బస్సులు రోడ్లపై పరుగులు పెట్టనున్నాయి. పీఎం ఈ-డ్రైవ్ పథకంలో భాగంగా నగరానికి 2 వేల విద్యుత్ బస్సులు రానున్నాయి. వీటిని త్వరలో తెలంగాణ ఆర్టీసీ అధికారులు ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆర్టీసికి ఎలక్ట్రిక్ బస్సులు సరఫరా చేసేందుకు కేంద్రం ఇటీవల బిడ్లను ఆహ్వానించింది. ఈ బిడ్లలో 2 వేల బస్సులను అందించేందుకు మేఘా సంస్థకు చెందిన ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, గ్రీన్‌సెల్ మొబిలిటీ సంస్థలు అర్హత సాధించాయి. ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 1085 బస్సులను అందించనుండగా.. 915 సంస్థలు ఎలక్ట్రిక్ బస్సులను పంపిణీ చేయనుంది.
దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల బిడ్లను ఆహ్వానించింది. అయితే ఇటీవల న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో ఇప్పుడు బిడ్లను కేంద్రం ఆమోదించింది. తెలంగాణ ఆర్టీసికి అందించేందుకు రెండు సంస్థలకు అనుమతి రావడంతో దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సులను అందించనున్నాయి. అద్దె ప్రాతిపాదికన ఆర్టీసీకి సరఫరా చేయనున్నాయి. వీటిని వీలైనంత త్వరగా హైదరాబాద్ ప్రజల కోసం ఆర్టీసీ అందుబాటులోకి తీసుకురానుంది. జనవరిలోనే ఈ కొత్త బస్సులు రోడ్లపైకి రానున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే నగరంలో రద్దీకి తగ్గట్లు బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పీక్ అవర్స్‌లో నిల్చోని ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఒకవేళ బస్సులో జనం ఫుల్‌గా ఉంటే నెక్ట్స్ బస్ కోసం వేచి ఉండాల్సి వస్తోంది.
అద్దె ప్రతిపాదికన కంపెనీలు ఆర్టీసీకి బస్సులను అందించనున్నాయి. కిలోమీటర్‌కు ఎంత అద్దె అనే విషయంపై కంపెనీలతో కేంద్రం సంప్రదింపులు జరుపుతోంది. అద్దె తగ్గించాలని కంపెనీలను కేంద్రం కోరుతోంది. వారం, పది రోజుల్లో దీనిపై క్లారిటీ రానుండగా. . ఆ తర్వాత పంపిణీ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,878 బస్సులు సేవలు అందిస్తుండగా.. 2039 నాటికి 100 శాతం ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే ఉండేలా ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీలో ఎక్కువగా డిజిల్ బస్సులే ఉన్నాయి. డిజిల్ రేట్లు ఎక్కవగా ఉండటం వల్ల ఆర్టీసీకి భారం ఎక్కువ పడుతుంది. అదే ఎలక్ట్రిక్ బస్సులు ఉంటే డిజిల్ ఖర్చు తగ్గడం వల్ల ఆర్టీసీకి కూడా నిధులు ఆదా అవుతాయి. అలాగే పర్యావరణపరంగా కూడా లాభం చేకూరుతుంది.