ఉన్నత విద్య కోసం ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్తున్న భారతీయులు కొందరైతే, విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి చదువుకుంటున్న విదేశీయులు మరికొందరు ఉన్నారు. ఇదంతా ఇప్పుడెందుకని అనుకుంటున్నారా.? ఓ ఇద్దరు నైజీరియన్లు ఉన్నత చదువు కోసం స్టూడెంట్ వీసా మీద ఢిల్లీకి వచ్చారు. అక్కడ ఉండి చదువుకోకపోగా ఆన్‌లైన్‌లో మోసాలకు పాల్పడుతూ పబ్బం గడుపుతున్నారు. ఒమినోస్ సిల్విస్టర్(23), చుక్వా(23) అనే ఇద్దరు నైజీరియన్లకు ఢిల్లీలో అరెస్ట్ చేశారు రాచకొండ పోలీసులు. ఇంతకీ అసలేం జరిగింది.? వారి వెనుక ఉన్న స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..
ఈ ఇద్దరు నైజీరియన్లు ఇన్‌స్టాగ్రామ్‌లో తమ పేర్లను అలెక్స్, విలియమ్స్‌గా పెట్టుకుని యూరప్ సిటీజన్లుగా ప్రొఫైల్ డిస్క్రిప్షన్ క్రియేట్ చేసుకున్నారు. యూరప్ సిటీజన్ల పేరుతో అమాయకులను మోసం చేస్తూ వారి నుంచి లక్షలు కొల్లగొడుతున్నారు. మొదట తెలియని వ్యక్తులకు ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపిస్తారు. ఆ వెంటనే ఫ్రెండ్‌షిప్ పేరుతో బాధితుడుతో చాట్ చేస్తారు. సదరు బాధితుడు తమను పూర్తిగా నమ్మే విధంగా మాటా మాట కలుపుతారు. తమ దారిలోకి వచ్చేవరకు ఏదో ఒక మెసేజ్ చేస్తూ వారిని నమ్మేలాగ చేసుకుంటారు. తీరా వీరి మీద నమ్మకం ఏర్పడిన తర్వాత బాధితుడికి గిఫ్ట్ పంపిస్తాం అంటూ నమ్మిస్తారు. వీరి చేతిలో మోసపోయిన హైదరాబాద్ యువతి రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న రాచకొండ పోలీసులు ఇద్దరు నైజీరియన్లను ఢిల్లీలో అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో అలెక్స్ పేరుతో దివ్యకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టారు. అలెక్స్ ఎవరో తెలియకపోయినా దివ్య ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసింది. దీంతో దివ్యతో చాట్ మొదలుపెట్టాడు అలెక్స్. దివ్య తనను పూర్తిగా నమ్మిన తర్వాత తన ప్లాన్ అమలు చేశాడు. ఫ్రెండ్షిప్ పేరుతో భారీగా గిఫ్ట్‌లు పంపిస్తున్నానంటూ మాయమాటలు చెప్పి యువతిని నమ్మించాడు. యువతి అడ్రస్, ఫోన్ నెంబర్ అన్నీ తీసుకున్న తర్వాత.. ఆ నైజీరియన్ రెండు రోజుల్లో గిఫ్ట్ ఇంటికి వస్తుందంటూ దివ్యను నమ్మబలికించాడు. ఆ మరుసటి రోజు గిఫ్ట్‌లకు సర్వీస్ ఛార్జ్ చెల్లించాలంటూ కస్టమ్స్ అధికారులుగా ఫోన్ చేశారు. ఇక సర్వీస్ ఛార్జ్ కూడా చెల్లించేందుకు దివ్య సిద్ధపడింది. ముక్కుమొహం తెలియని వ్యక్తి, పైగా ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. అయినా కూడా ఎలాంటి అనుమానం వ్యక్తం చేయకుండా నైజీరియన్ చెప్పిన విధంగా ఒక బ్యాంక్ ఖాతాకు సుమారు రూ. 3.63 లక్షలు చెల్లించింది దివ్య. అయినా కూడా గిఫ్ట్స్ ఏవి కూడా రాకపోవడంతో.. తాను మోసపోయానని గ్రహించి రాచకొండ పోలీసులను ఆశ్రయించింది దివ్య. దీంతో రంగంలోకి దిగిన రాచకొండ పోలీసులు, కేసు నమోదు చేసి.. ఆ ఇద్దరు నైజీరియన్లను అరెస్ట్ చేశారు. కాగా, వీరిపై గతంలోనూ ఇలాంటి పలు కేసులు నమోదైనట్టు గుర్తించారు. అలాగే ఆ ఇద్దరి దగ్గర నుంచి రూ. 1.78 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
గిఫ్ట్ పేరుతో నైజీరియన్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఎవరూ కూడా నైజీరియన్ల బారిన పడవద్దు అని పోలీసులు ప్రజలకి సూచిస్తున్నారు. కస్టమ్స్ అధికారుల సర్వీస్ టాక్స్ పేరుతో అమాయకుల జేబులకు నైజీరియన్లు చిల్లు వేస్తున్నట్టు పోలీసులు చెప్తున్నారు. ఎవరైనా ఆన్లైన్ చాట్ పేరుతో ఈ తరహా సంభాషణ చేస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాల్సిందిగా పోలీసులు చెబుతున్నారు. అలాగే అరెస్టు చేసిన ఇద్దరు నైజీరియన్లను ఢిల్లీ నుండి ట్రాన్స్‌లేట్ మీదుగా హైదరాబాద్‌కు తరలించారు.