టీఆర్‌ఎస్(తెలంగాణ రాష్ట్ర సమితి) 18వ వార్షికోత్సవాన్ని శనివారం నిర్వహించుకోవడానికి రాష్ట్రంలోని పార్టీ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతోపాటు పరిషత్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ శ్రేణులు బిజీ కావడంతో ఈసారి వేడుకలను సాదాసీదాగా జరుపుకోవాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా కేవలం పార్టీ పతాకాల ఆవిష్కరణకు మాత్రమే పరిమితం కావాలని ప్రకటించింది. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఏప్రిల్ 27, 2001న టీఆర్‌ఎస్ పార్టీని స్థాపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే ఏకైక లక్ష్యంతో ఆయన పార్టీ పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. జూన్ 2, 2014న తెలంగాణ ఏర్పాటు కల సాకారం కాగా, నూతన రాష్ట్రంలో టీఆర్‌ఎస్ తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాటినుంచి కేసీఆర్ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.